సిగ్గుపడాలి; ఆమె ఓ ఆకతాయి!

11 Dec, 2019 09:40 IST|Sakshi

బ్రెసీలియా: స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త, వాతావరణ మార్పుపై ఉద్యమిస్తున్న గ్రెటా థంబర్గ్‌పై బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో అనుచిత వ్యాఖ్యలు చేశారు. గ్రెటా ఓ ఆకతాయి పిల్ల అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంపై గ్రెటా చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపడేశారు. అమెజాన్‌ అడవుల్లో ముగ్గురు గిరిజనులు కాల్పుల్లో మృతి చెందడంపై గ్రెటా స్పందించిన తీరు ఆయన ఆగ్రహానికి కారణమైంది. ప్రపంచ ఊపిరితిత్తులుగా పేరందిన అమెజాన్‌ అడవుల్లో ఇటీవల తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా అధిక సంఖ్యలో చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరాన్హా రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో శనివారం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు.

ఈ ఘటనపై స్పందించిన గ్రెటా... అడవుల అక్రమ నరికివేతను అడ్డుకున్నందుకే వారిని కాల్చి చంపారని ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడకుండా ఉన్నందుకు ప్రతీ ఒక్కరు సిగ్గుపడాలి అని బ్రెజిల్‌ అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో గ్రెటా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బోల్సోనారో.. ‘ప్రతీ చావుకు చింతించాల్సిందే. తనొక ఆకతాయి పిల్ల’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గిరిజనుల కాల్చివేత ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కాగా అస్‌పెర్జర్‌ సిండ్రోమ్‌తో బాధ పడుతున్న గ్రెటా.. గతేడాది డిసెంబరులో పోలాండ్‌లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్‌24 సదస్సులో ప్రసంగించారు. ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ పేరిట వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ వాతావరణ మార్పులపై ప్రసంగాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ఇక బోల్సోనారో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. అమెజాన్‌లో కార్చిచ్చు రగిలిన నేపథ్యంలో పర్యావరణ కార్యకర్తలే అడవిని తగులబెట్టారంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు