అమెరికా అధ్యక్షుడి రేసులో జో బిడెన్‌

7 Jun, 2020 05:08 IST|Sakshi

వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌పై పోటీకి దిగడం లాంఛనమే

వాషింగ్టన్‌: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌(77) నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ తరపున పోటీ పడేందుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ తరపున అభ్యర్థి ఎంపిక కోసం శుక్రవారం రాత్రి డెమొక్రటిక్‌ డెలిగేట్లు సమావేశమయ్యారు. మొత్తం 3,979 మంది ప్రతినిధులకుగాను 1,991 మంది జో బిడెన్‌ అభ్యర్థిత్వానికే మద్దతు పలికారు. సగం కంటే ఎక్కువ మంది బిడెన్‌ వైపు మొగ్గు చూపడంతో అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగడం ఇక లాంఛనమే. జో బిడెన్‌ 2009 నుంచి 2017 వరకు బరాక్‌ ఒబామా హయాంలో అమెరికా 47వ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

అమెరికా–భారత్‌ మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి ఒకరకంగా బిడెన్‌ మంత్రాంగమే కారణమని పరిశీలకులు చెబుతుంటారు. నవంబర్‌ 3న జరిగే ఎన్నికల్లో ఆయన ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఎదుర్కొనడం దాదాపు ఖాయమైనట్లే. ఈ సందర్భంగా జో బిడెన్‌ మాట్లాడుతూ... అమెరికా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం సంక్లిష్టమైన పరిస్థితి నెలకొందని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్‌ విభజన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమర్థవంతమైన, ప్రజలను ఐక్యంగా ఉంచే నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తోందని వ్యాఖ్యానించారు. ‘ప్రజలందరికీ మేలు చేసే ఆర్థిక వ్యవస్థ కావాలి. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, సమాన న్యాయం కావాలి. మన బాధలు తీర్చే అధ్యక్షుడు కావాలి’ అని బిడెన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు