కన్నీటి కఠ్మాండు..!

28 Apr, 2015 02:40 IST|Sakshi
కన్నీటి కఠ్మాండు..!

న్యూఢిల్లీ: ఎటు చూసినా మట్టి దిబ్బలు.. ఎవరిని కదిపినా కన్నీటి గాథలు.. కన్నవారిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఓ అభాగ్యుడు.. శిథిలమైన ఇంటి ముందు దీనంగా కూర్చున్న ఓ వృద్ధుడు.. పాలకోసం గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారులు.. కాసిన్ని నీళ్ల కోసం ఎదురుచూస్తున్న మహిళలు..! శిథిల నగరి కఠ్మాండులో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ!! పెను భూకంపం వచ్చి మూడ్రోజులు గడిచిపోతున్నా ఇక్కడి ప్రజలు ఇంకా భయం నీడనే బతుకులీడుస్తున్నారు.


భూకంపం మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందేమోనన్న భయంతో ఇళ్లలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. టార్పాలిన్ గుడారాలు వేసుకొని ఆరుబయటే కాలం వెళ్లబుచ్చుతున్నారు. అన్నపానీయాలు దొరకడం గగనమైపోయింది. చంటిబిడ్డలున్న తమకు పాల ప్యాకెట్లు కూడా దొరకడం లేదని మహిళలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఒక్క మంచి నీళ్ల బాటిల్ కొనాలంటే రూ.50 వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక భోజనానికి వందల రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తోంది. మార్కెట్‌లో కూరగాయలు కూడా అందుబాటులో లేవు. ఇళ్లు విడిచి అందరూ గుడారాలు వేసుకుంటుండడంతో టార్పాలిన్ ధరలు సైతం మూడు రెట్లు పెరిగిపోయాయి. చాలా మందికి ఫుట్‌పాత్‌లే ఆవాసాలయ్యాయి.
 

స్నానాలు, భోజనం, నిద్ర అంతా ఫుట్‌పాత్‌లపైనే! పశుపతినాథ్ ఆలయాన్ని ఆనుకొని ఉన్న నదీ తీరంలో సామూహిక అంత్యక్రియలు జరుపుతున్నారు. సోమవారం దాదాపు 200 మృతదేహాలకు దహనసంస్కారాలు నిర్వహించారు. క్షతగాత్రులకు వైద్యులు రోడ్లపైనే చికిత్స అందజేస్తున్నారు. మళ్లీ భూకంపం వస్తుందనే భయంతో డాక్టర్లు, రోగులు ఆసుపత్రుల గదుల్లోకి వెళ్లడం లేదు. కఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వద్ద తెలుగువారు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమను సొంత రాష్ట్రానికి చేర్చే ఏర్పాట్లు చేయడం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని విజయవాడకు చెందిన సత్యనారాయణ కుటుంబం ఆవేదన వ్యక్తంచేసింది.

మరిన్ని వార్తలు