స్క్రీన్‌కు అతుక్కుంటే ప్రమాదమే!

19 Nov, 2023 05:34 IST|Sakshi

12 ఏళ్ల చిన్నారుల మెదడు భౌతిక, పనితీరుపై దుష్ప్రభావాలు

హాంకాంగ్, చైనా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: పన్నెండేళ్లలోపు చిన్నారులు ఎక్కువ సేపు స్క్రీన్‌లకు అతుక్కుపోతే మెదడు పనితీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గత 23 సంవత్సరాలపాటు 30,000 మంది చిన్నారుల మెదడు ఇమేజ్‌లను విశ్లేషించి సంబంధించిన సమగ్ర అధ్యయనాన్ని హాంకాంగ్, చైనా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల బృందం బహిర్గతంచేసింది.

చిన్నారుల మెదడు సంక్లిష్ట అభివృద్ది క్రమంపై ‘డిజిటల్‌’ ప్రభావం స్థాయిని లెక్కించేందుకు ఈ అధ్యయనం చేపట్టారు. మెదడు అభివృద్ధి చెందే క్రమంలో కొత్త రకం పనులు చేయాల్సి వచ్చినపుడు న్యూరాన్ల నెట్‌వర్క్‌ ఏ మేరకు మార్పులకు లోనవుతుందనే అంశాలనూ శాస్త్రవేత్తలు పరిశీలించారు. రీసెర్చ్‌ కోసం చిన్నారి మెదడు 33 విభిన్న ఇమేజ్‌లను విశ్లేషించారు...

► ఎక్కువ సేపు టీవీ చూడటం, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటంతో 12 ఏళ్లలోపు చిన్నా రుల మెదడు పనితీరు ప్రభావితమవుతోంది
► దీంతో మెదడు పైపొర కార్టెక్స్‌లో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయి
► జ్ఞాపకశక్తి, ప్లానింగ్‌ సామర్థ్యం, స్పందించే గుణంలో మార్పులు వస్తున్నాయి
► దీంతో స్పర్శ, ఒత్తిడి, వేడి, చల్లదనం, నొప్పి వంటి ఇంద్రియ సంబంధ అంశాలను మెదడు ప్రాసెస్‌ చేసే విధానంలోనూ మార్పులు కనిపించాయి
► జ్ఞాపకశక్తి, వినడం, భాష వంటి వాటిని గుర్తుంచుకునే మెదడు భాగంలో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి
► దృశ్య సమాచారాన్ని సరిపోల్చే మెద డు భాగంలో భౌతిక మార్పులు కనిపించాయి
► ముఖ్యంగా ‘ట్యాబ్‌’ను వినియోగించే వారి మెదడు పనితీరు, సమస్యల  పరిష్కార సామర్థ్యం బాగా తగ్గిపోయాయి.
► మేథస్సు, మెదడు పరిమాణం తగ్గిపోవడానికి వీడియో గేమ్స్, అత్యధిక ఇంటర్నెట్‌ వినియోగమే కారణమని రీసెర్చ్‌ వెల్లడించింది.
► డిజిటల్‌ అనుభవాలు చిన్నారుల మెదడులో మార్పులు తెస్తున్నాయని అధ్యయనం కరస్పాండింగ్‌ రచయిత, హాంకాంగ్‌ యూనివర్సిటీకి చెందిన హూయిలీ చెప్పారు.

మరిన్ని వార్తలు