సెకనులోనే 23 సినిమాలు డౌన్‌లోడ్ చేయెచ్చు!

24 Feb, 2016 15:37 IST|Sakshi
సెకనులోనే 23 సినిమాలు డౌన్‌లోడ్ చేయెచ్చు!

బార్సీలోనా: వైఫై సిగ్నల్‌, పాస్‌వర్డ్ వంటి జంఝాటం లేకుండా కేవలం ఒక్క క్షణం కరెంటు బల్బు కింద మన మొబైల్ ఫోన్‌ పెట్టగానే.. అది ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయితే ఎలా ఉంటుంది.. అద్భుతం కదా? అలాంటి అద్భుతాన్ని సుసాధ్యం చేస్తానంటోంది లై-ఫై టెక్నాలజీ. ప్రస్తుత వైఫై విధానం కన్నా 100 రెట్లు వేగంగా పనిచేసే ఈ సాకేంతిక పరిజ్ఞానం.. వైర్‌లెస్‌ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది.

ఈ మేరకు లైఫై టెక్నాలజీని ఫ్రాన్స్‌ కు చెందిన స్టార్టప్ కంపెనీ ఒలెడ్‌కమ్‌.. బర్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలో భాగంగా కార్యాలయంలోని ఓ బల్బు కింద స్మార్ట్‌ఫోన్‌ పెట్టగానే అది ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయింది. అందులో ఓ ఆన్‌లైన్ వీడియో సైతం వేగంగా ప్లే అయింది. 'లైట్‌ ఇన్‌ఫిడలిటీ' సంక్షిప్త నామమైన 'లైఫై' పేరుకు తగ్గట్టే మెరుపు వేగంతో పనిచేస్తుంది. లాబరేటరీ పరీక్షల్లో ఈ టెక్నాలజీ ద్వారా ఒక సెకనుకు 200 జీబీ డాటా ట్రాన్స్‌ఫర్ కావడం గమనార్హం. అంటే కేవలం ఒక సెకనులోనే 23 డీవీడీ సినిమాలను ఈ టెక్నాలజీ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ఒలెడ్‌కామ్‌ అధిపతి స్వాట్‌ తాప్సు తెలిపారు. వెఫై కన్నా లైఫై వందరెట్లు వేగంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. వైఫై రేడియో తరంగాల ఆధారంగా డాటాను బట్వాడా చేస్తుండగా.. ఎల్‌ఈడీ బల్బుల నుంచి వెలువడే ఫ్రీక్వెన్సీస్‌ ఆధారంగా లైఫై డాటాను ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంది. డిజిటల్ మోర్స్ కోడ్‌ సమానంగా ఒక సెకనులో మెరుపువేగంతో సమాచారాన్ని బదిలీ చేయడం లైఫై టెక్నాలజీ ప్రత్యేకత. దీనిని ఇప్పటికే భారత్, బెల్జియం, ఇస్టోనియా వంటి దేశాల్లోని షాపింగ్ మాళ్లు, మ్యూజియంలలో పరీక్షించారు. ఈ టెక్నాలజీ అమల్లోకి వస్తే.. వైఫై కనుమరుగు కావొచ్చునని నిపుణులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు