కోవిడ్‌ గుప్పిట్లో ఇటలీ 

11 Mar, 2020 10:28 IST|Sakshi

ఇటలీలో మొత్తంగా 463 మంది మృతి 

రోమ్‌: కరోనా వైరస్‌ విజృంభణ చైనా నుంచి ఇటలీకి మారింది. సోమవారం ఇటలీ మొత్తమ్మీద 97 మంది మరణించడం, 1,807 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో ఇప్పటివరకూ ఇటలీలో వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 463కు చేరుకోగా వ్యాధి సోకిన వారి సంఖ్య 9,172కు చేరుకుంది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో ఇటలీ అధ్యక్షుడు జుసెపే కాంటీ అత్యవసర ప్రయాణాలు మినహా మిగిలిన వాటినన్నింటిపై నిషేధం విధించారు.

ఈ నిషేధం ఏప్రిల్‌ మూడు వరకు కొనసాగనుంది. సోమవారం చైనాలో 17 మరణాలు మాత్రమే సంభవించగా ఈ సంఖ్య 97గా ఉంది. ఇరాన్‌లో ఒక్క రోజులోనే 54 మంది మరణించారు. కొత్తగా వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య చైనాలో 19కే పరిమితమైంది. ఇదిలా ఉండగా.. సుమారు మూడు నెలలుగా చైనాలో కరోనా వైరస్‌కు కేంద్రంగా నిలిచిన వూహాన్‌ ప్రాంతాన్ని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మంగళవారం తొలిసారి సందర్శించారు. హుబే ప్రాంతంలోని ఓ ఆసుపత్రిని సందర్శించిన ఆయన పరిస్థితిని సమీక్షించారు. చైనాలో ఇప్పటివరకూ సంభవించిన మరణాల సంఖ్య 3,136కు చేరగా, ప్రపంచవ్యాప్తంగా 4,000ను దాటింది.  
ఇరాన్‌లో ఎక్కువైన మరణాలు
ఇరాన్‌లో మొత్తమ్మీద ఇప్పటివరకూ 291 మంది కోవిడ్‌ కారణంగా మరణించగా, వ్యాధి సోకిన వారి సంఖ్య 8,042గా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి కియానూష్‌ జహాన్‌పూర్‌ ఒక వీడియో ప్రకటన ద్వారా తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కరోనా వైరస్‌ పరీక్షలు జరపలేదని వైట్‌హౌస్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు