2018; మాకు అత్యంత సానుకూలం.. !

23 Jan, 2018 16:56 IST|Sakshi

కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కేలండర్‌లో సంవత్సరం, తేదీలు, వారాలు మారటమే కాదు.. గత కాలపు చేదు స్మృతులు, అనుభవాలను తొలగిస్తుందనే ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టే సందర్భం. ఏంటీ 2018లోకి ప్రవేశించి ఇప్పటికే సుమారు నెల కావస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసేసుకున్నాం కదా.. మళ్లీ ఈ ప్రస్తావన ఎందుకని ఆలోచిస్తున్నారా.. అదేనండీ మీలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం గురించి ఎంతమంది, ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకున్నారో తెలుసుకునేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ ఇప్సాసిస్‌ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. ఆ సర్వే వివరాలేమిటో ఓ సారి చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో సర్వే నిర్వహించగా మొత్తంగా 76 శాతం మంది ప్రజలు 2017తో పోలిస్తే ఈ ఏడాది తమకు సానుకూలంగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. వీరిలో ముఖ్యంగా యువత
2018ని అత్యంత ఆశావహ సంవత్సరంగా పేర్కొన్నారు. లాటిన్‌ అమెరికా దేశాలైన కొలంబియా, పెరూలో 93శాతం మంది సానుకూలంగా స్పందించారు. 88శాతం మంది చైనీయులు
2018కే ఓటు వేశారు.

ఇక మన దేశంలో 87శాతం మంది 2018 పట్ల ఆశావహంగానే ఉన్నారు. అమెరికన్లకు గతేడాది అధ్యక్ష ఎన్నికలతో ఎంతో నాటకీయంగా గడిచిపోయింది. డొనాల్డ్‌ ట్రంప్‌ పట్ల చాలామంది బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారు. 80శాతం మంది అమెరికన్లు కనీసం ఈ ఏడాదైనా మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక యూరప్‌ దేశాల విషయానికొస్తే... జర్మనీలో 67శాతం,  బ్రిటన్‌లో 67శాతం, ఫ్రాన్స్‌లో కేవలం 55శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నారు. ఈ సర్వేలో 44శాతం మందితో జపాన్‌ అట్టడుగు స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు