దేశ దేశాల నామాయణం! పేర్లు మార్చకున్న దేశాలు ఇవే! | Sakshi
Sakshi News home page

దేశ దేశాల నామాయణం! పేర్లు మార్చకున్న దేశాలు ఇవే!

Published Sun, Sep 24 2023 8:55 AM

Some Countries Have Changed Their Names For Various Reasons - Sakshi

పేరులోనేముంది అని చాలామంది కొట్టిపారేస్తారు గాని, పేరు మీద పట్టింపుగల వాళ్లు తక్కువేమీ కాదు. మనుషులు పేర్లు మార్చుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. చిరపరిచితమైన ఊళ్లు, దేశాల పేర్లు మారిపోతే మాత్రం విశేషమే! ‘ఇండియా దటీజ్‌ భారత్‌’ అని మన రాజ్యాంగంలోని మొదటి అధికరణలో ఉంది. విదేశీయులు మనల్ని ఇండియన్స్‌గానే సంబోధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మన దేశానికి భారత్‌గా పునర్నామకరణం చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపింది. ఇప్పటికైతే అధికారికంగా మన దేశం పేరు మారలేదు. త్వరలోనే మారితే మారవచ్చు కూడా! అలాగని దేశాలు పేరు మార్చుకోవడం కొత్తేమీ కాదు. ఆధునిక ప్రపంచంలో పేర్లు మార్చుకున్న దేశాలు కొన్ని ఉన్నాయి. వాటి విశేషాలు మీ కోసం...

రాచరికాలు కొనసాగిన కాలంలో రాజుల ఆధిపత్యాలను బట్టి రాజ్యాల పేర్లు తరచు మారిపోతూ ఉండేవి. ఆధునిక ప్రపంచంలో దేశాల పేర్లు అంత తరచుగా మారిపోవడం లేదు గాని, అప్పుడప్పుడూ రకరకాల కారణాల వల్ల అవి మారుతూనే ఉన్నాయి. ఇరవయ్యో శతాబ్ది నుంచి ఇప్పటి వరకు పేర్లు మార్చుకున్న కొన్ని దేశాల గురించి తెలుసుకుందాం.

చెకియా
చెకొస్లోవేకియా నుంచి 1992 విడివడిన తర్వాత ఈ దేశం పేరు ‘చెక్‌ రిపబ్లిక్‌’గా ఉండేది. ఈ దేశం పేరు మార్పు వెనుక ఘనమైన చారిత్రక, సాంస్కృతిక కారణాలేవీ లేవు. మరెందుకు పేరు మార్చుకున్నారంటే, ఇదివరకటి పేరు పెద్దగా ఉందట! పెద్దగా ఉన్న పేరుతో అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు పొందడం కష్టమని, విదేశీయులకు ఆ పేరు పలకడం కష్టంగా ఉందని పాలకులు భావించారు. అంతర్జాతీయ సమాజాన్ని ఆకట్టుకోవడానికి, మరింతగా విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి 2016 ఏప్రిల్‌లో దేశం పేరును ప్రభుత్వం ‘చెకియా’గా మార్చుకుంది. అధ్యక్షుడు మిలోస్‌ జెమాన్‌ ఆధ్వర్యంలో ఈ మార్పు జరిగింది.

ఇరాన్‌
ఇప్పుడు ఇరాన్‌ అంటే జనాలకు బాగా అలవాటైపోయిన పేరు. ఇదివరకు దీని పేరు పర్షియాగా ఉండేది. పర్షియా తన పేరును 1935లో ఇరాన్‌గా మార్చుకుంది. ఈ మార్పు వెనుక నాజీల ప్రభావం ఉంది. ఆర్యుల జనాభా ఎక్కువగా ఉండే దేశాలతో నాజీ జర్మనీ ‘సత్సంబంధాలు’ కలిగి ఉండేది. ‘ఆర్యన్‌’ నుంచి వచ్చిన పేరే ఇరాన్‌! జర్మనీలో అప్పటి పర్షియా రాయబారి మొహసిన్‌ రియాస్‌ ఈ పేరు మార్పు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగించాడు.

బహుశా నాజీల మెప్పు కోసం ఆయన ఆ ప్రయత్నాలు చేసి ఉండవచ్చనే వాదన లేకపోలేదు. మొత్తానికి అప్పటి పర్షియా అధినేత రెజా షా పహ్లావీ 1935లో ఇకపై తమ దేశాన్ని ‘ఇరాన్‌’ పేరుతో గుర్తించాలని తమ దేశంతో దౌత్యసంబంధాలు కలిగి ఉన్న దేశాలన్నింటినీ కోరారు. అవి ఆ కోరికను మన్నించడంతో పర్షియా పేరు ఇరాన్‌గా మారింది. రెండో ప్రపంచయుద్ధం ఫలితంగా జర్మనీలో నాజీ ప్రభుత్వం పతనమైన తర్వాత మిగిలిన దేశాలు కూడా పర్షియాను ఇరాన్‌గా గుర్తించడంతో అదే పేరు స్థిరపడింది.

బోత్స్యానా
ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఉన్న చిన్న దేశం బోత్స్యానా. దీనికి ఇంతకు ముందున్న పేరు ‘బెషువాన్‌లాండ్‌ ప్రొటెక్టరేట్‌’. బ్రిటిష్‌ పాలకులు దీన్ని 1885లో ప్రొటెక్టరేట్‌గా ప్రకటించారు. స్థానిక ‘త్సా్వనా’ పదాన్ని పలకలేక వారు ‘బెషువానా’గా వ్యవహరించేవారు. చాలా పోరాటాలు, చర్చోపచర్చల తర్వాత ఈ దేశానికి 1966లో స్వాతంత్య్రం దక్కింది. సెరెత్సె ఖామా తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ‘త్వ్సానా’ తెగ ప్రజలు అత్యధికులుగా ఉన్న ఈ దేశానికి బ్రిటిష్‌వారు అపభ్రంశ పదాలతో పెట్టిన పేరును మార్చి, ‘బోత్స్యానా’గా మార్చారు. ‘బోత్స్యానా’ అంటే ‘త్వ్సానా’ ప్రజల నేల. ఈ పేరు మార్పును అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించింది.

శ్రీలంక
శ్రీలంక పాత పేరు సిలోన్‌. బ్రిటిష్‌ పాలకులు ఆ పేరు పెట్టారు. ‘సహీలన్‌’ అరబిక్‌ పదం నుంచి వారు ఆ పేరు పెట్టారని చెబుతారు. అయితే, ఆ పేరు పుట్టుపూర్వోత్తరాల గురించి వేర్వేరు వాదనలు ఉన్నాయి. పదో శతాబ్దానికి చెందిన అరబిక్‌ రచయిత ఇబ్న్‌ షహ్రియార్‌ తన ‘అజబ్‌–అల్‌–హింద్‌’ పుస్తకంలో శ్రీలంకను ఉద్దేశించి ‘సెరెన్‌దిబ్‌’, ‘సహీలన్‌’ అనే పదాలను ఉపయోగించాడు. తొలినాళ్లలో దీని పేరు ‘తామ్రపర్ణి’గా ఉండేది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన గ్రీకుయాత్రికుడు మెగస్తనీస్‌ దీనినే తన రచనల్లో ‘తప్రోబన’ అని పేర్కొన్నాడు.

బ్రిటిష్‌వారి కంటే ముందు ఈ ప్రాంతాన్ని పోర్చుగీసు, స్పానిష్, ఫ్రెంచ్, డచ్‌ వాళ్లు కూడా కొంతకాలం పరిపాలించారు. పోర్చుగీసులు దీనిని ‘సీలావో’ అని, స్పానిష్‌ వాళ్లు ‘సీలాన్‌’ అని, ఫ్రెంచ్‌వాళ్లు ‘సీలన్‌’ అని, డచ్‌వాళ్లు ‘జీలన్‌’ అని వ్యవహరించేవారు. అయితే, బ్రిటిష్‌ హయాంలో పెట్టిన ‘సిలోన్‌’ పేరు ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఈ దేశానికి 1948లోనే స్వాతంత్య్రం వచ్చినా, 1966 వరకు సిలోన్‌ పేరుతోనే ఉండేది. సిరిమావో బండారునాయకె ప్రధానిగా ఉన్న కాలంలో దేశం పేరును ‘శ్రీలంక’గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఐర్లండ్‌
ఇప్పటి ప్రపంచానికి ఐర్లండ్‌ పేరు బాగా పరిచయం గాని, అంతకుముందు దీని పేరు ‘ఐరిష్‌ ఫ్రీ స్టేట్‌’. ఇంగ్లిష్‌ వాళ్ల పాలనలో దాదాపు మూడు శతాబ్దాలు మగ్గిన దేశం ఇది. ఐరిష్‌ జాతీయోద్యమం తర్వాత తొలుత ఇది 1922లో బ్రిటిష్‌ సామ్రాజ్యంలోని స్వయంపాలిత రాజ్యంగా మారింది. బ్రిటిష్‌ ప్రభుత్వం 1931లో దీనిని ‘నిర్వివాద స్వతంత్ర దేశం’గా ప్రకటించడంతో ‘ఐరిష్‌ ఫ్రీ స్టేట్‌’గా అవతరించింది. ఐర్లండ్‌ ద్వీపంలోని మొత్తం 32 కౌంటీలు ఉంటే, వాటిలోని 26 కౌంటీలతో ‘ఐరిష్‌ ఫ్రీ స్టేట్‌’ ఏర్పడింది. మిగిలిన ఆరు కౌంటీలు ‘నార్తర్న్‌ ఐర్లండ్‌’గా బ్రిటిష్‌ సామ్రాజ్యంలోని భాగంగానే ఉన్నాయి. ఐరిష్‌ రాజ్యాంగం 1937లో దేశం పేరును అధికారికంగా ‘ఐర్లండ్‌’గా మార్చింది. ఐర్లండ్‌ 1949లో ‘రిపబ్లిక్‌’గా మారడంతో మిగిలిన ప్రపంచం అప్పటి నుంచి ఇదే పేరుతో గుర్తించడం ప్రారంభించింది.

థాయ్‌లాండ్‌
థాయ్‌లాండ్‌ ఇప్పుడు అందరికీ అలవాటైపోయిన పేరు. ఇదివరకు దీని పేరు ‘సియామ్‌’. ‘శ్యామ’ అనే సంస్కృత పదం నుంచి ‘సియామ్‌’ పేరు వచ్చింది. ‘సియామ్‌’ అనేది ఈ దేశవాసులు పెట్టుకున్న పేరు కాదు, విదేశీయులు పెట్టిన పేరు. ఫీల్డ్‌ మార్షల్‌ ప్లేక్‌ ఫిబున్‌సాంగ్‌ఖ్రామ్‌ ప్రధాని పదవిలోకి వచ్చి, నియంతృత్వాధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన 1939లో ‘సియామ్‌’ పేరును ‘థాయ్‌లాండ్‌’గా మార్చారు. ‘థాయ్‌’ భాషలో ‘థాయ్‌’ అంటే ‘మనిషి’, ‘స్వతంత్రుడు’ అనే అర్థాలు ఉన్నాయి. స్వతంత్రుల దేశం అనే అర్థం వచ్చేలా ‘థాయ్‌లాండ్‌’ పేరును ఎంపిక చేసుకున్నారు. మిగిలిన ప్రపంచం దీనిని గుర్తించడంతో ఇదే పేరు స్థిరపడింది.

ఇస్వాతిని
ఆఫ్రికా ఆగ్నేయ ప్రాంతంలోని చిన్న దేశం ఇది. ఈ దేశం ఇదివరకటి పేరు ‘స్వాజిలాండ్‌’. చాలాకాలం బ్రిటిష్‌ వలసరాజ్యంగా ఉండేది. ఇక్కడ ఎక్కువగా స్వాజీ తెగకు చెందిన ప్రజలు ఉంటారు. పూర్వీకుడైన తెగ నాయకుడి పేరు మీదుగా తమ తెగకు ‘స్వాజీ’ అని పేరు పెట్టుకున్నారు. బ్రిటిష్‌ పాలన నుంచి స్వాతంత్య్రం పొంది యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దేశానికి రాజుగా ఉన్న మూడో ఎంస్వాతి దేశం పేరును తన పేరు కలిసొచ్చేలా ‘ఇస్వాతిని’గా మార్చారు. ఎవరితోనూ సంప్రదించకుండా రాజు ఏకపక్షంగా దేశం పేరు మార్చేశారనే విమర్శలు ఉన్నా, అంతర్జాతీయ సమాజం కొత్తగా మార్చిన పేరు గుర్తించడంతో మారిన పేరుతోనే చలామణీ అవుతోంది.

నార్త్‌ మాసిడోనియా
యూరోప్‌ ఆగ్నేయ ప్రాంతంలోని దేశం నార్త్‌ మాసిడోనియా. ఇదివరకు దీని పేరు మాసిడోనియా మాత్రమే! రెండో ప్రపంచయుద్ధ కాలంలో 1944లో ఈ ప్రాంతం ‘సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ మాసిడోనియా’గా ఆవిర్భవించింది. తర్వాత 1991లో రిఫరెండం ద్వారా స్వాతంత్య్రం సాధించుకుని, ‘మాసిడోనియా’గా మారింది. ఈ ప్రాంతానికి చాలా పురాతన చరిత్ర ఉంది. ప్రాచీనకాలంలో గ్రీకు సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఇప్పటికీ మాసిడోనియా ప్రాంతంలోని కొంతభాగం ఈ దేశానికి దక్షిణాన గల గ్రీస్‌లో ఉంది. పొరుగుదేశంతో గందరగోళం తొలగించుకోవాలనే ఉద్దేశంతో 2019లో ఈ దేశం తన పేరును ‘నార్త్‌ మాసిడోనియా’గా మార్చుకుంది.

మయాన్మార్‌
మన దేశానికి సరిహద్దుల్లోని ఆగ్నేయాసియాలో ఉన్న ఈ దేశానికి ఇదివరకటి పేరు ‘బర్మా’. అధికారికంగా మయాన్మార్‌గా మారినా, ‘బర్మా’ పేరుతో ఈ దేశాన్ని గుర్తుపట్టేవాళ్లు ఇప్పటికీ ఎక్కువమందే ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా బర్మన్‌ తెగకు చెందిన ప్రజలు నివసిస్తారు. అందువల్ల ‘బర్మా’గా పేరుపొందింది. బ్రిటిష్‌ పాలన నుంచి ఈ దేశం 1948లో స్వాతంత్య్రం పొందింది. అలజడులతో అతలాకుతలమైన ఈ దేశం 1989లో జరిగిన సైనిక కుట్రలో పూర్తిగా సైనిక పాలనలోకి వెళ్లింది. అప్పట్లో అధికారంలోకి వచ్చిన సైనిక పాలకులు దేశం పేరును మయాన్మార్‌గా మార్చారు. ‘మయాన్మార్‌’ పదం పుట్టుపూర్వోత్తరాల గురించి ఇప్పటికీ గందరగోళం ఉంది.బెనిన్‌

అట్లాంటిక్‌ తీరంలో ఉన్న ఆఫ్రికన్‌ దేశం ఇది. ఆఫ్రికా పడమటి తీరాన ఉన్న ఈ చిన్న దేశానికి గతంలో ఉన్న పేరు ‘దహోమీ’. చిన్న రాజ్యంగా ఉండే ఈ దేశం పదిహేనో శతాబ్దిలో చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలను కలుపుకొని ‘దహోమీ’ రాజ్యంగా అవతరించింది. స్థానిక ఫోన్‌ తెగకు చెందిన ప్రజలు మాట్లాడే ‘ఫోంగ్బే’ భాషలో ‘ఫోన్‌ ద హోమీ’ అంటే ‘పాము పొట్ట’ అని అర్థం. దేశం ఆకారం దాదాపు అలాగే ఉండేది కాబట్టి వారు ‘దహోమీ’ అని పేరు పెట్టుకున్నారు.

ఈ దేశాన్ని 1872లో ఫ్రెంచ్‌వాళ్లు ఆక్రమించుకుని, 1960 వరకు పరిపాలన కొనసాగించారు. ఫ్రెంచ్‌ పాలన అంతమయ్యాక 1960లో స్వాతంత్య్రం వచ్చినా, ‘దహోమీ’ పేరుతోనే పదిహేనేళ్లు కొనసాగింది. మాథ్యూ కెరెకోవు నేతృత్వంలోని సైనిక బలగాలు 1972లో అప్పటి ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కెరెకోవు నేతృత్వంలోని ప్రభుత్వం 1975లో దేశం పేరును ‘బెనిన్‌’గా మార్చింది. ‘ఫోన్‌’ తెగ తర్వాత ‘బిని’ తెగవారు కూడా ఈ దేశంలో గణనీయంగా ఉంటారు. ‘బిని’ తెగ మూలం గానే బెనిన్‌ పేరు పెట్టారు. అయితే, ‘బిని’ తెగ జనాభా నైజీరియాలో ఎక్కువగా ఉంటారు.

సూరినామా
దక్షిణ అమెరికాలోని ఈశాన్యతీరంలో ఉన్న దేశం సూరినామా. దీని ఇదివరకటి పేరు సూరినామ్‌. స్థానిక స్రానన్‌ టోంగో భాషలో ‘ఆమ’ పదానికి నది లేదా నదీముఖద్వారం అనే అర్థాలు ఉన్నాయి. ఈ దేశాన్ని వేర్వేరు యూరోపియన్‌ దేశాల వారు ఆక్రమించుకున్నారు. బ్రిటిష్‌వారు 1630లో వలస రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అధికసంఖ్యాకులు సూరీనియన్‌ తెగకు చెందినవారు. స్థానిక భాష అర్థంకాని బ్రిటిష్‌ వలస పాలకులు దీని పేరును ‘సూరినామ్‌’గా వ్యవహరించేవారు. పదిహేడో శతాబ్ది చివర్లో బ్రిటిష్‌ వారి నుంచి ఈ దేశం డచ్‌ పాలకుల చేతిలోకి వెళ్లింది. అప్పట్లో ఇది డచ్‌ గయానాలో భాగంగా ఉండేది. డచ్‌ పాలకులు ఇక్కడి నుంచి భారీగా చక్కెర ఎగుమతి చేసేవారు. దాదాపు రెండు శతాబ్దాలు సాగిన డచ్‌ పాలన నుంచి ఈ దేశానికి 1975లో స్వాతంత్య్రం లభించింది. స్వాతంత్య్రం వచ్చాక, పాశ్చాత్యులు తమ దేశానికి పెట్టిన అపభ్రంశ పదాన్ని తమ భాషకు అనుగుణంగా మార్చుకుని, 1978లో ‘సూరినామా’గా స్వతంత్ర పాలకులు ప్రకటించుకున్నారు. స్వతంత్ర దేశానికి తొలి అధ్యక్షుడైన హెంక్‌ ఆరన్‌ హయాంలో ఈ మార్పు అమలులోకి వచ్చింది.

నెదర్లాండ్స్‌
మూడేళ్ల కిందటి వరకు ఈ దేశం పేరు హాలండ్‌. పశ్చిమ యూరోప్‌లోని డచ్‌ ప్రజల దేశం ఇది. ఇక్కడి ప్రభుత్వం 2020లో దేశం పేరును ‘నెదర్లాండ్స్‌’గా మార్చినట్లు ప్రకటించింది. ‘హాలండ్‌’ పేరు దేశంలోని రెండు డచ్‌ రాష్ట్రాలు గల ప్రాంతానికే వర్తిస్తుందని, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా కలుపుకొనేలా ఒక పేరుపెట్టడం బాగుంటుందని దేశ నేతలు కొంతకాలం మల్లగుల్లాలు పడ్డారు. చివరకు ప్రధాని మార్క్‌ రుట్టే  నేతృత్వంలోని ప్రభుత్వం ‘నెదర్లాండ్స్‌’ పేరును ఖాయం చేసింది.

జింబాబ్వే
ఆఫ్రికా ఆగ్నేయప్రాంతంలోని దేశం ఇది. దీని ఇదివరకటి పేరు ‘రొడీషియా’. ఇక్కడ బ్రిటిష్‌ వలస రాజ్యానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు సెసల్‌ రోడ్స్‌ పేరు మీద అప్పటి బ్రిటిష్‌ వలస పాలకులు ఈ దేశానికి ‘రొడీషియా’ అని పేరు పెట్టారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా 1960లలో ఇక్కడి నల్లజాతీయులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. ఉద్యమకాలంలో వారు తమ దేశానికి ‘జింబాబ్వే’ పేరును వాడుకలోకి తెచ్చారు. ‘జింబాబ్వే’ అంటే స్థానిక ‘షువావు’భాషలో ‘రాతి ఇళ్ల దేశం’ అని అర్థం. పోరాట ఫలితంగా 1965లో స్వాతంత్య్రం వచ్చినా, పాలనలో 1979 వరకు నల్లజాతీయులు మైనారిటీలుగానే మిగిలారు. గెరిల్లా పోరాటం తర్వాత 1979లో జరిగిన ఎన్నికల్లో రాబర్ట్‌ ముగాబే నాయకత్వంలో నల్లజాతీయ ప్రభుత్వం ఏర్పడింది. ముగాబే ప్రభుత్వం దేశం పేరును ‘జింబాబ్వే’గా మార్చింది.

బుర్కీనా ఫాసో
ఆఫ్రికా పశ్చిమ ప్రాంతంలోని చిన్న దేశమిది. స్వాతంత్య్రానికి ముందు ఫ్రెంచ్‌ పాలనలో ఉండేది. ఫ్రెంచ్‌ పాలకులు దీనిని ఫ్రెంచ్‌ భాషలో ‘హాట్‌–వోల్టా’ అని, ఇంగ్లిష్‌లో ‘అప్పర్‌ వోల్టా’ అని వ్యవహరించేవారు. ఈ దేశానికి ‘అప్పర్‌ వోల్టా’ పేరు ఎక్కువగా చలామణీలో ఉండేది. ఫ్రెంచ్‌ వలస పాలకుల నుంచి 1958లో ఈ దేశానికి స్వయంపాలనాధికారం లభించింది. తర్వాత రెండేళ్లకు 1960లో పూర్తి స్వాతంత్య్రం వచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ వోల్టా’గా దేశం పేరు మారింది. వలస పాలకుల ఆనవాళ్లను పూర్తిగా తుడిచివేయాలనే ఉద్దేశంతో 1984లో అప్పటి అధ్యక్షుడు థామస్‌ సంకారా తమ దేశానికి ‘బుర్కీనా ఫాసో’ పేరును ప్రకటించారు. స్థానిక మూరీ భాషలో ‘బుర్కీనా ఫాసో’ అంటే నిజాయతీపరుల దేశం అని అర్థం.

డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో
ఆఫ్రికా మధ్య ప్రాంతంలోని రెండో అతిపెద్ద దేశం ఇది. బెల్జియం రాజు రెండో లియోపోల్డ్‌ 1885లో ఇక్కడ సొంతరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లియోపోల్డ్‌ హయాంలో ఈ దేశాన్ని ‘కాంగో ఫ్రీ స్టేట్‌’ అనేవారు. తర్వాత 1908 నాటికి ఇది పూర్తిగా బెల్జియం ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చింది. బెల్జియన్ల పాలనలో ఈ దేశాన్ని ‘బెల్జియన్‌ కాంగో’గా వ్యవహరించేవారు. బెల్జియన్ల నుంచి ఈ దేశానికి 1960లో స్వాతంత్య్రం వచ్చాక ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ జైరీ’గా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దాదాపు ఐదేళ్లు దేశం తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలతో అతలాకుతలమైంది. అంతర్యుద్ధంలో సైనికాధికారి మొబుటు సెసె సీకో 1965లో అధికారాన్ని చేజిక్కించుకుని నియంతృత్వ పాలన ప్రారంభించారు. దేశంలో ప్రవహించే కాంగో నది పేరు మీదుగా ఆయన దేశానికి ‘కాంగో’ పేరు పెట్టాడు. రెండేళ్లలోనే 1967లో సీకో ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన తిరుగుబాటు నాయకుడు లారెంట్‌ డిజైర్‌ కబిలా దేశానికి ‘డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో’ పేరును ఖాయం చేశారు.

కాబో వెర్డీ
ఆఫ్రికా పశ్చిమాన ఉన్న చిన్న ద్వీపసమూహ దేశం ఇది. పదేళ్ల కిందటి వరకు ఈ దేశం ‘కేప్‌ వెర్డీ’ అనే ఇంగ్లిష్‌ పేరుతోనే చలామణీ అయ్యేది. తొలుత పోర్చుగీసులు ఈ ద్వీపసమూహాన్ని 1462లో ఆక్రమించుకుని, నావికా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి వస్తువులే కాకుండా, బానిసలను కూడా దేశదేశాలకు ఎగుమతి చేసేవారు. స్థానిక క్రియోలె భాషలో ఈ దీవులకు ‘కాప్‌–వెర్ట్‌’ అనేవారు అంటే, ‘ఆకుపచ్చని అగ్రం’. దాని ఆధారంగానే పోర్చుగీసులు ఈ ద్వీపసమూహానికి తమ భాషలో ‘కాబో వెర్డీ’ అనే పేరు పెట్టుకున్నారు. ఇంగ్లిష్‌ మాట్లాడే దేశాలతో వారు లావాదేవీలు సాగించడంతో వారికి అర్థమయ్యేలా ‘కేప్‌ వెర్డీ’ అనేవారు. పోర్చుగీసుల నుంచి ఈ దేశానికి 1975లో స్వాతంత్య్రం వచ్చింది. దేశాధ్యక్షుడు జోస్‌ మారియా నెవిస్‌ 2013లో దేశానికి తిరిగి పోర్చుగీసు పదాన్ని అధికారికంగా వాడుకలోకి తీసుకొచ్చారు.

తుర్కియే
నిన్న మొన్నటి వరకు ఈ దేశం ‘టర్కీ’ పేరుతోనే చలామణీలో ఉండేది. ఇక్కడి తుర్కు ప్రజల ప్రాచీన నాగరికత, సంస్కృతి ప్రతిబింబించేలా స్థానిక భాషలోనే దేశం పేరు ఉండాలనే ఉద్దేశంతో అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగాన్‌ గత ఏడాది దేశం పేరును ‘తుర్కియే’గా మార్చినట్లు ప్రకటించారు. అంతర్జాతీయ సమాజం ఈ దేశాన్ని ఇప్పుడు ఇదే పేరుతో గుర్తిస్తోంది. నిజానికి అంతర్జాతీయంగా ఏర్పడిన ఒక చిన్న ఇబ్బంది ఈ దేశం పేరు మార్చుకోవడానికి కారణమైంది. ‘థాంక్స్‌ గివింగ్‌ డే’ సందర్భంగా ఉత్తర అమెరికన్లు సంప్రదాయంగా ఇచ్చేవిందులో టర్కీ కోళ్లు తప్పనిసరి. టర్కీ కోళ్లను వాళ్లు ‘టర్కీ’గానే వ్యవహరిస్తారు. కోడిజాతికి చెందిన పక్షుల పేరు, తమ దేశం పేరు ఒకటే కావడంతో గందరగోళం ఏర్పడుతోందని, దీన్ని తప్పించుకోవడానికే దేశం పేరు మార్చుకోవాల్సి వచ్చిందని ‘తుర్కియే’ విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

(చదవండి: ఆదర్శగురువులెందరో..వారందరికీ ప్రణామం!)

Advertisement

తప్పక చదవండి

Advertisement