పపువా న్యూగినియాలో భారీ భూకంపం

8 May, 2019 02:22 IST|Sakshi

రిక్టర్‌ స్కేలుపై 7.2 తీవ్రత నమోదు

పోర్ట్‌ మోర్స్‌బై: పపువా న్యూగినియా దేశంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.2గా నమోదైంది. బులాలో నగరానికి 33 కిలోమీటర్లు, రాజధాని పోర్ట్‌ మోర్స్‌బైకి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే విభాగం పేర్కొంది. అయితే,  భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని ఆ దేశ అధికార వర్గాలు పేర్కొన్నాయి. అలాగే భూకంప ప్రభావంతో సునామీ వచ్చే అవకాశాలు లేవని తెలిపాయి. భూకంప ప్రభావానికి సంబంధించి ఇప్పటి వరకు తమకు పూర్తి సమాచారం లేదని, పరిస్థితిని ఇంకా అంచనా వేస్తున్నామని బులాలో పోలీస్‌ స్టేషన్‌ కమాండర్‌ లియో కైకాస్‌ వెల్లడించారు. టేబుల్స్‌ పైనుంచి వస్తువులు కిందపడటం వంటి చిన్న సంఘటనలు తప్ప పెద్దగా ఎలాంటి నష్టం సంభవించలేదని బులాలో పైన్‌ లాడ్జి హోటల్‌ సిబ్బంది చెప్పారని పేర్కొన్నారు. యూఎన్‌ డేటా ప్రకారం భూకంప కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో దాదాపు 1,10,000 మంది ప్రజలు నివసిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.  

మరిన్ని వార్తలు