'జుకర్ బర్గ్ వారసుడి'తో డేటింగ్..!

5 Jan, 2016 19:53 IST|Sakshi
డార్లిన్ లొరెటా, జుకర్ బర్గ్

షకీరాలాంటి గొంతు, షరపోవాలా ఆటతీరు, కనీసం చదువులో రాణింపు.. ఇవేవీ లేకుండా ఓ టీనేజ్ అమ్మాయి గొప్ప ధనవంతురాలు కావాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్న తనకుతానే వేసుకుని, తన మనుమరాలికి ఓ బామ్మ ఇచ్చిన సలహా, ఆ సలహాకు ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ స్పందన  ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

'డియర్ జుకర్ బర్గ్.. ఎవరైనా ఓ నెర్డీ(ఎప్పుడూ టెక్నాలజీతో కుస్తీపడే వ్యక్తి) ఫెలోతో డేటింగ్ చెయ్యమని నా మనుమరాలికి సలహా ఇచ్చా. సాధారణ దుస్తులు, భూతద్దాలంటి కళ్లద్దాలు పెట్టుకుని ఎప్పుడూ సిస్టమ్ మీద పనిచేసుకుంటూ.. సాధారణ వ్యక్తిలా కనిపించే అలాంటి వాళ్లే భవిష్యత్ లో మీలా గొప్ప కార్యాలు సాధిస్తారు. కోటానుకోట్లు సంపాదిస్తారు. అందుకే నా మనుమరాల్ని నెర్డీతో డేట్ కు వెళ్లమని ప్రోత్సహిస్తున్నా' అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది డార్లిన్ లొరెటా అనే బామ్మ.

అందుకు ప్రతిగా 'నెర్డీ ఫెలోతో డేటింగ్ చెయ్యడం కంటే స్వయంగా అలా తయారవ్వటమే ఉత్తమం. మీ  తరఫున మీ మనుమరాలికి నేనిచ్చే సలహా ఇదే' అని జుకర్ బర్గ్ బదులిచ్చారు. ఏ ఆధారం లేకున్నా తమ కాళ్లపై తాము నిలబడేలా అమ్మాయిలను తయారుచేయాలని తాను గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశాడు. జుకర్ బర్గ్ ప్రతిస్పందన అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు లైక్స్ వర్షం కురిపించారు.

ఇంతకు ముందు చెప్పినట్లే తన కంపెనీలో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు ఫేస్ బుక్ వ్యవస్థాపక సీఈవో జుకర్ బర్గ్. ప్రస్తుతం ఆ కంపెనీ సాధారణ ఉద్యోగుల్లో కేవలం 16 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అదే ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో 23 శాతం మహిళలున్నారు. మిగిలిన టెక్నాలజీ కంపెనీల్లోనూ మహిళా ఉద్యోగుల సంఖ్య అంతంతమాత్రమే!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు