Climate Change: డేంజర్‌ మార్క్‌ దాటేశాం

21 Nov, 2023 04:43 IST|Sakshi

2 డిగ్రీలు పెరిగిన భూతాపం

ఇంతటి పెరుగుదల ఇదే తొలిసారి

పెను వినాశనానికి సూచనే: సైంటిస్టులు

కట్టడి చర్యలేవీ ఫలించడం లేదు

పర్యావరణవేత్తల తీవ్ర ఆందోళన


భయపడుతున్నంతా అవుతోంది. మితిమీరిన కాలుష్యం, ఇంధన వాడకం, అడ్డూ అదుపూ లేని పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత భూమిని శరవేగంగా వినాశనం వైపు నెడుతున్నాయి. వీటివల్ల భూతాపోన్నతి అతి త్వరలో ‘2 డిగ్రీ’ల అంతిమ హద్దును దాటుతుందని, అదే జరిగితే సర్వనాశనమేనని పర్యావరణప్రియులు, శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా హెచ్చరిస్తుండటం తెలిసిందే. ఈ పెను విపత్కర పరిస్థితిని నివారించడమే ఏకైక లక్ష్యంగా చిన్నా పెద్దా దేశాలన్నీ దశాబ్దాలుగా మేధోమథనం చేస్తున్నాయి.

గ్లోబల్‌ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వస్తున్నాయి. అందుకు వందల కోట్ల డాలర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆ లక్ష్యాల సాధనకు క్షేత్ర స్థాయిలో చేస్తున్నదేమీ లేదని తేలిపోయింది. నవంబర్‌ 17న అంతటి విపత్కర పరిస్థితిని భూమి తొలిసారిగా రుచిచూసింది. భూతాపంలో గత శుక్రవారం తొలిసారి ఏకంగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! భూగోళాన్ని మనం శరవేగంగా వినాశనం దిశగా నెడుతున్నామనేందుకు ఇది తాజా హెచ్చరిక సంకేతమేనని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు...!

వినాశనమే...?
గ్లోబల్‌ వారి్మంగ్‌తో ఎదురయ్యే ప్రమాదాన్ని కళ్లకు కట్టేందుకు పర్యావరణవేత్తలు భూతాపాన్ని పారిశ్రామికీకరణకు ముందు నాళ్లతో, అంటే 1850–1900 మధ్య కాలంతో పోల్చి చెబుతుంటారు. అప్పటితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌ దాకా పెరిగిపోయింది. దానికే కొన్నేళ్లుగా కనీవినీ ఎరగని ఉత్పాతాలతో ప్రపంచమంతా అతలాకుతలమైపోతోంది. అలాంటిది, నవంబర్‌ 17న సగటు భూతాపంలో పెరుగుదల కొద్దిసేపు ఏకంగా 2.06 డిగ్రీలుగా నమోదైందని యూరప్‌లోని కోపరి్నకస్‌ వాతావరణ మార్పుల సంస్థ సోమవారం ప్రకటించింది!

1991–2020 మధ్య నమోదైన భూతాప సగటుతో పోలి్చనా ఇది ఏకంగా 1.17 డిగ్రీలు ఎక్కువని సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ సమంతా బర్గెస్‌ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆమె చేసిన పోస్టు పర్యావరణవేత్తల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘‘గ్లోబల్‌ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేయకుంటే సర్వనాశనం తప్పదన్న హెచ్చరికలను సంపన్న దేశాలు పెడచెవిన పెడుతున్నాయని తేలిపోయింది. భూమిపై జీవజాలాన్ని తుడిచిపెట్టగల ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామన్న మాటలు నీటి మూటలేనని రుజువైంది’’ అంటూ వారు మండిపడుతున్నారు. మానవాళి చరిత్రలో నవంబర్‌ 17 దుర్దినమేనని సైంటిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘కాప్‌’ లక్ష్యాలన్నీ గాలికి...
గ్లోబల్‌ వారి్మంగ్‌ను 2 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి, సరిగ్గా చెప్పాలంటే 1.5 డిగ్రీలకు పరిమితం చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పారిస్‌ పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. దాని సాధనే ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా కాప్‌ సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాయి. కాప్‌–27 పర్యావరణ సదస్సు గతేడాది నవంబర్లో జరిగింది. పర్యవారణ లక్ష్యాల సాధనకు ఆర్థిక వనరుల్లేని పేద దేశాలకు వందలాది కోట్ల డాలర్లు గ్రాంట్‌గా అందజేసేందుకు సంపన్న దేశాలన్నీ అంగీకరించాయి. గ్లోబల్‌ వారి్మంగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు తామంతా కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని దాదాపుగా తగ్గించేస్తామని చెప్పుకొచ్చాయి.

కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు...
► చాలా దేశాలు శిలాజ ఇంధనోత్పత్తిని 2030కల్లా రెట్టింపు, అంతకంటే ఎక్కువ చేయనున్నాయని ఐరాస గత వారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది!
► గ్లోబల్‌ వారి్మంగ్‌ 1.5 శాతానికి పెరగకుండా ఉండాలంటే కర్బన ఉద్గారాలను 2030కల్లా 45 శాతం తగ్గించాల్సి ఉంది. గత కాప్‌ సదస్సులో దేశాలన్నీ నిర్దేశించుకున్న లక్ష్యం కూడా అదే. కానీ అన్ని దేశాలూ తమ తమ పర్యావరణ లక్ష్యాలను సాధించినా కర్బన ఉద్గారాలు 2030కల్లా 9 శాతం పెరుగుతాయని హెచ్చరించింది.
► గ్లోబల్‌ వార్మింగ్‌ ఉత్పాతానికి అడ్డుకట్ట వేసేందుకు దేశాలు చేయాల్సినంత ప్రయత్నం చేయడం లేదని పలు అంతర్జాతీయ పర్యావరణ నివేదికలు కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి.
► ముఖ్యంగా గ్రీన్‌హౌజ్‌ వాయువుల ఉద్గారాన్ని తగ్గించేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం చాలా అవసరమని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌లో             క్లైమేట్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ రిచర్డ్‌ అలన్‌ స్పష్టం చేస్తున్నారు.  
► గత సదస్సుల వాగ్దానాలేవీ ఆచరణలోకి రాలేదన్న పెదవి విరుపుల మధ్య మరో రెండు వారాల్లో దుబాయ్‌లో కాప్‌–28 సదస్సు జరగనుంది. అందులో ఏమేం చర్చిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి!

వినాశనమే...?
ఉష్ణోగ్రతలో ఒకట్రెండు డిగ్రీల పెరుగుదలతో ఏమవుతుంది లెమ్మనుకుంటే చాలా పొరపాటు. భూమి సగటు ఉష్ణోగ్రత అతి తక్కువగా పెరిగినా తీవ్ర పర్యవసానాలుంటాయి. అలాంటిది ఒక డిగ్రీ పెరిగిందంటే అది తీవ్ర ప్రభావమే చూపుతుంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే అదే జరుగుతోంది! గత వందేళ్లలో భూతాపం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే సగటున ఒకటిన్నర డిగ్రీల మేరకు పెరిగిపోయింది. దాంతో నానారకాల పర్యావరణ ఉత్పాతాలతో మానవాళి అతలాకుతలం అవుతోంది. అదే ఉష్ణోగ్రతలో పెరుగుదల గనక 2 డిగ్రీలకు చేరితే కనీవినీ ఎరగని వినాశనం, కష్టనష్టాలు తప్పవని పర్యావరణవేత్తలు ఎప్పట్నుంచో నెత్తీనోరూ బాదుకుంటున్నారు. భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటిన కొద్దీ దారుణాలు జరుగుతాయి. అదే 2 డిగ్రీలు పెరిగిందంటే...
► పెను తుఫాన్లు, తీవ్ర దుర్భిక్షం వంటి అతి దారుణ పరిస్థితులు తలెత్తుతాయి.
► పర్యావరణ సంతులనాన్ని కాపాడటంలో అతి కీలకమైన కోరల్‌ రీఫ్‌లు, ధ్రువ ప్రాంతపు మంచు పొరలు సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి.
► పర్యావరణ వ్యవస్థ మరింకెప్పటికీ ఎన్నటికీ బాగుచేయలేనంతగా పాడైపోతుంది.
► క్రమంగా భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంది.
► జీవ, జంతు జాలాల మనుగడ ప్రమాదంలో పడుతుంది.
► అత్యుష్ణ పరిస్థితులు స్థిరంగా కొనసాగితే జీవజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు.
► గత 12 నెలలు ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడి నెలలుగా రికార్డుకెక్కాయి. గత ఏడాది కాలంలో పాకిస్తాన్, ఉత్తర అమెరికాలో తీవ్ర వరదలు, ఆస్ట్రేలియా, అమెరికాల్లో కార్చిచ్చులు, మంచు తుఫాన్ల వంటి వైపరీత్యాలతో ప్రపంచం అల్లాడింది.
► మన దేశంలో చూసుకుంటే పారిశ్రామికీకరణకు ముందు చెన్నై సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీలుండేది. ఇప్పుడది 29.5 డిగ్రీలు దాటేసింది! ఇదే ధోరణి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రతిఫలిస్తోంది.
► ఇటీవలే ఉత్తరాఖండ్‌లో భూమి బీటలుబారడం తెలిసిందే.

భూతాపంలో  పెరుగుదల 2 డిగ్రీల సెంటీగ్రేడ్ల సరిహద్దును దాటింది కొద్దిసేపు మాత్రమే. కానీ భూమి నానాటికీ ఆమోదయోగ్యం కానంతగా వేడెక్కిపోతోందనేందుకు ఇది అతి పెద్ద
సంకేతం. ఇదే ధోరణి ఇంకొంతకాలం కొనసాగితే దిద్దుబాటు అసాధ్యమే కావచ్చు!

– సమంతా బర్గెస్, డిప్యూటీ డైరెక్టర్, కోపర్నికస్‌ వాతావరణ మార్పుల సంస్థ
 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు