మిస్‌ యూనివర్స్‌గా మిస్‌ దక్షిణాఫ్రికా.!

27 Nov, 2017 11:55 IST|Sakshi

టాప్‌ 16 లోనూ లేని భారత సుందరి శ్రద్ధా శశిధర్‌

లాస్‌ వేగాస్‌: ఈ ఏడాది విశ్వ సుందరిగా దక్షిణాఫ్రికా యువతి డెమీలే–నెల్‌ పీటర్స్‌(22) ఎంపికయ్యారు. కొలంబియా సుందరి లౌరా గోంజాలెజ్, జమైకా యువతి డావినా బెన్నెట్‌ వరసగా మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. అమెరికాలోని లాస్‌ వేగాస్‌లో ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గతేడాది మిస్‌ యూనివర్స్‌ ఇరిస్‌ మిటెనారె.. డెమీలేకు కిరీటం తొడిగారు.

భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన శ్రద్ధా శశిధర్‌ తుది 16 మందిలో కూడా చోటు దక్కించుకోలేకపోయారు. నవంబర్‌ 18న మానుషి ఛిల్లర్‌  ప్రపంచ సుందరిగా ఎంపికవడంతో ప్రపంచ అందాల వేదికపై భారత్‌ మరో విజయాన్ని ఆశించినా ఈసారి నిరాశే ఎదురైంది. ఈ పోటీలో కీలకమైన ప్రశ్న–జవాబు రౌండ్‌లో జ్యూరీ అడిగిన ప్రశ్నకు డెమీలే ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది.

‘మీలో ఉన్న ఏ గుణం పట్ల మీరు గర్వంగా ఫీలవుతున్నారు? మిస్‌ యూనివర్స్‌గా దాన్ని ఎలా ఉపయోగిస్తారు?’ అని ప్రశ్నించగా...అందుకు డెమీలే బదులిస్తూ ‘మిస్‌ యూనివర్స్‌ వ్యక్తిగతంగా ఆత్మ విశ్వాసంతో ఉండాలి. ఎన్నో భయాలు, బలహీనతలను అధిగమించిన మహిళే ఈ స్థాయికి చేరుకుంటుంది. అలాగే సాటి మహిళలు తమ భయాలను తొలగించుకునేలా మిస్‌ యూనివర్స్‌ వారికి సాయం చేసే స్థితిలో ఉంటుంది’ అని చెప్పారు. మొత్తం 92 మంది అందగత్తెలు పోటీ పడిన ఈ కార్యక్రమంలో మిస్‌ వెనెజులా, మిస్‌ థాయిలాండ్‌లు కూడా తుది ఐదుగురిలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు