ఆ సైనికులు మమ్మల్ని రేప్ చేశారు!

25 Nov, 2016 19:35 IST|Sakshi
ఆ సైనికులు మమ్మల్ని రేప్ చేశారు!
మయన్మార్ సైనికులు చేస్తున్న అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వాళ్ల చేతుల్లో హబీబా, ఆమె సోదరి అనుభవించిన దారుణ నరకం వెలుగు చూసిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. వేలాది మంది రోహింగ్యాలు మయన్మార్ సైనికుల ఆగడాలు భరించలేక బంగ్లాదేశ్‌కు వలసపోతున్నారు. వాళ్లు తామిద్దరినీ కట్టేసి, ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారని హబీబా (20) వాపోయింది. ఇప్పుడు ఆమె బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దుల్లోని ఓ శరణార్థి శిబిరంలో ఓ రోహింగ్యా కుటుంబంతో పాటు తలదాచుకుంది. ఇక్కడ తమకు తినడానికి తిండి లేకపోయినా.. కనీసం తమను చిత్రహింసలు పెట్టడానికి ఎవరూ రారన్న విషయమే సంతోషంగా ఉందని హబీబా సోదరుడు హషీముల్లా చెప్పాడు. హబీబాతో పాటు ఆమె సోదరి సమీరా (18)ని కూడా మయన్మార్ సైనికులు ఎత్తుకుపోయి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. వాళ్ల ఇంటిని తగలబెట్టేశారు. తమదే కాదని.. ఇంకా చాలా ఇళ్లను తగలబెట్టేశారని హబీబా చెప్పింది. తమ తండ్రితో సహా అనేక మందిని చంపేశారని, చిన్నపిల్లలని కూడా చూడకుండా ఆడపిల్లలపై అత్యాచారాలు చేశారని ఆమె చెప్పింది. 
 
ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తే చంపేస్తామని బెదిరించి, సైనికులు అక్కడినుంచి వెళ్లిపోయారని.. వెళ్లే ముందు తమ ఇంటిని తగలబెట్టేశారని ఆమె చెప్పింది. రోహింగ్యా ముస్లిం తెగల వారిపై మయన్మార్‌లో ఘోరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దాంతో వేలాదిమంది అక్కడినుంచి వెళ్లిపోతున్నారు. మయన్మార్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను వెళ్లగొడుతోందని ఐక్యరాజ్యసమితి కూడా హెచ్చరించింది. హబీబా కుటుంబంలో మిగిలిన ముగ్గురు ఎలాగోలా తాము దాచిపెట్టుకున్న డబ్బులు తీసుకుని వందలాది రోహింగ్యా కుటుంబాలతో పాటు జాగ్రత్తగా కొండల నడుమ నాలుగు రోజులు దాక్కుని, చివరకు ఒక బోటు యజమాని వారిని బంగ్లాదేశ్ తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. అతడు వాళ్లదగ్గరున్న డబ్బులన్నింటినీ తీసేసుకున్నాడు. సరిహద్దుల సమీపంలో ఓ చిన్న దీవి వద్ద వారిని వదిలేశాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి ఓ రోహింగ్యా కుటుంబాన్ని ఆశ్రయించారు. ఇలాంటి వందలాది కథనాలు మయన్మార్ - బంగ్లాదేశ్ సరిహద్దులలో కనిపిస్తున్నాయి. 
మరిన్ని వార్తలు