ముక్కలైన మరో అతి పెద్ద మంచు ఫలకం

16 Nov, 2017 11:13 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఈ భూగోళంపై ప్రకృతి రచించిన దృశ్య కావ్యం అంటార్కిటికా. అది ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశం మాత్రమే కాదు... నిత్యం వీచే పెనుగాలులతో, విరిగిపడే మంచు చరియలతో సందర్శకులను భీతావహుల్ని చేసే ప్రాంతం కూడా. రకరకాల పరిశోధనల్లో నిత్యం నిమగ్నమై ఉండే అయిదారువేల మంది శాస్త్రవేత్తలు తప్ప అక్కడ వేరే జనాభా ఉండదు. భూతల్లి చల్లగా నాలుగు కాలాలపాటు వర్ధిల్లాలంటే అంటార్కిటికాలో పెనుమార్పులు చోటు చేసుకోకుండా ఉండాలని పర్యావరణవాదులు చెబుతుంటారు. దాని పరిరక్షణకు ఏమేం చర్యలు అవసరమో వివరిస్తుంటారు.

కానీ ప్రకృతితో మనిషి ఆడుతున్న వికృత క్రీడల కారణంగా అంతా తారుమారవుతోంది. క్షణానికి వెయ్యి టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతూ భూమిని వేడెక్కిస్తున్న పర్యవసానంగా ఆ మంచు ఖండం ఛిద్రమవుతోంది. వచ్చే నూరేళ్లలో ఊహించ శక్యం కూడా కాని ఉత్పాతం మానవాళికి చేరు వవుతోంది. మొన్నటికిమొన్న అంటార్కిటికాలో ఉన్న అతి పెద్ద మంచు ఫలకం ‘లార్సెన్‌–సి’  హిమపర్వతం నుంచి వేరుపడిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

తాజాగా మరో అతి భారీ మంచు ఫలకం రెండు ముక్కలైన దృశ్యాన్ని నాసా కెమెరాలో బంధించింది. అంటార్కిటికాలో మంచు ఫలకాలు ముక్కలవుతున్న వరుస ఘటనలు పర్యావరణ వాదులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా వేరుపడిన మంచు ఫలకం గ్రీన్‌లాండ్‌ దేశంలో ప్రతి ఏటా కరుగుతున్న మంచుకు సమానమని నాసా పేర్కొంది. హిమ పర్వతం నుంచి వేరుపడిన మంచు ఫలకం కొట్టుకుపోతున్నట్లు తెలిపింది. 

ఈ ఏడాది జులైలో ఓ హిమ పర్వతం నుంచి వేరుపడిన లార్సెన్‌-సి బరువు దాదాపు లక్ష టన్నుల కోట్లు. వైశాల్యంలో న్యూఢిల్లీ నగర పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెద్దదని శాస్త్రవేత్తులు లెక్కగట్టారు కూడా. లార్సెన్‌–సి కి పగుళ్లు ఏర్పడుతున్న వైనాన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా చాన్నాళ్ల క్రితమే శాస్త్రవేత్తలు గమనించారు. ఈ ఏడాది జూన్‌లో ఈ మంచు ఫలకం ప్రధాన పర్వతంతో దాదాపుగా విడిపోయిందని, కేవలం బలహీనమైన బంధం మాత్రమే మిగిలి ఉన్నదని చెప్పారు. జులై నెలలో అది కూడా  తెగిపోయింది. వరుసగా భారీ మంచు ఫలకలు ఖండాన్ని విడిపోతున్నందువల్ల అంటార్కిటికా ద్వీపకల్పం రూపురేఖలు మారిపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

సముద్రమట్టం పెరిగే ప్రమాదం..
వరుసగా మంచు ఫలకలు ముక్కలై కరిగిపోతుండటం ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. విడిపోయిన ఫలకాలు అక్కడి నుంచి పెనువేగంతో ముందుకు కదులుతాయో లేక ఎక్కడో నిలిచిపోయి దానికదే ఒక మంచు పర్వతంలా మారుతాయో లేక  క్రమేపీ శకలాలుగా విడిపోయి కరుగుతూ అంతరిస్తుందా అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేని పరిస్థతి నెలకొంది.  

శాస్త్రవేత్తల అసలు ఆందోళనంతా హిమ ఫలకాలు తెగిపడుతున్నాయని కాదు. ఈ పరిణామాల పర్యవసానంగా పైనుంచి విరుచుకుపడే హిమనీ నదులు ముందుకు పోకుండా ఈ హిమ పర్వతాలు సీసా బిగించే బిరడాలా అడ్డుకుంటాయి. ఫలితంగా ఆ నదులు ముందుకెళ్లలేక ఉన్నచోటే నిలిచిపోయి అక్కడే క్రమేపీ గడ్డకట్టుకుపోయి మంచు పర్వతంలో భాగమైపోతాయి. 

మంచు పర్వతం దగ్గర ఏ అవరోధమూ లేకపోయినా, ముందుకెళ్లడానికి ఎంతో కొంత దారి కనబడినా హిమనీ నదులు ఒక్కసారిగా విజృంభించి అంటార్కిటికా మహా సముద్రంలో కలిస్తే సముద్ర నీటి మట్టాలపై అది చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. ఆ మట్టాలు ఒక్కసారిగా 10 సెంటీమీటర్లు పెరుగుతాయి. తాజా విరిగిన మంచు ఫలకం వల్ల సముద్ర మట్టం మూడు మిల్లీమీటర్ల పాటు పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అయితే ఇదంతా భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా... అసంఖ్యాకమైన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా చేస్తున్నదే. 2002లో లార్సెన్‌–సి కి పక్కనుండే లార్సెన్‌–బి శకలాలుగా విడిపోయి చిన్నదై పోయింది. అనంతరకాలంలో హిమానీ నదుల ప్రవాహ వేగం రెండు నుంచి ఆరు రెట్లు పెరిగింది. 

ప్రమాదంలో పర్యావరణం..
లార్సెన్‌–ఏ, లార్సెన్‌–బి, లార్సెన్‌–సి వంటి హిమ పర్వతాల్లో మంచు మేటలు వేయడానికి దోహదపడుతున్న హిమనీ నదాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిల్లో ఫ్లెమింగ్‌ పేరుతో ఉన్న హిమనీ నది అతి పెద్దది. అనేక చిన్న నదుల సంగమంగా ఉండే ఫ్లెమింగ్‌ దాదాపు 80 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ నది వద్ద 60వ దశకంతో పోలిస్తే ఇప్పుడు మంచు వేగంగా సముద్రంలో కలుస్తున్నదని శాస్త్రవేత్తలు లెక్కేస్తున్నారు.

కరిగే మంచుకూ, హిమానీ నదుల్లోని ప్రవాహానికీ మధ్య ఉండే నిష్పత్తి స్థిరంగా కొనసాగుతున్నంతకాలం అక్కడ యధాస్థితికి ముప్పుండదు. అందులో ఏమాత్రం తేడా వచ్చినా పర్యావరణం ప్రమాదంలో పడుతుంది. మంచు ఫలకాలు వేరు పడినప్పుడు జరిగే ఉత్పాతం అంతా ఇంతా కాదు. అక్కడ నివసించే పెంగ్విన్‌ పక్షులు మొదలుకొని వివిధ రకాల జీవాల వరకూ అన్నిటిపైనా అది పెను ప్రభావం చూపుతుంది. నిరుడు ఒక మంచు ఫలకం విరిగిపడి లక్షన్నర పెంగ్విన్‌ పక్షుల ప్రాణాలు మంచులో శిథిలమైపోయాయి.

మరిన్ని వార్తలు