ఒక్క ట్రిప్పు నాలుగిళ్ళ కరెంటు | Sakshi
Sakshi News home page

ఒక్క ట్రిప్పు నాలుగిళ్ళ కరెంటు

Published Thu, Nov 16 2017 11:10 AM

Special Story on Metro Train Power Supply - Sakshi

త్వరలో పరుగులు పెట్టనున్న మెట్రో రైలుకు మరో ప్రత్యేకత.. విద్యుత్‌. గ్రేటర్‌లో ఇవి తిరగాలంటే నిరంత విద్యుత్‌ సరఫరా ఎంతో అవసరం. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు సైతం చేశారు. మరి ఇళ్లలో వినియోగించే విద్యుత్‌కు.. మెట్రో రైళ్లు నడవడానికి అవసరమైన విద్యుత్‌కు సంబంధం లేదు.. కానీ వాటికి ఎంత కరెంటు అవసరముంటుందో సులువుగా తెలుసుకునేందుకే ఈ లెక్క. 

సాధారణంగా ఇంటి అవసరాలకు ఎంత విద్యుత్‌ అవసరమో అందరికీ తెలిసిందే. ఆ లెక్కన నాలుగు సాధారణ ఇళ్లలో నెలరోజుల పాటు వివిధ గృహోపకరణాలు, విద్యుద్ధీపాలను వెలిగించేందుకు ఎంత బిల్లు వస్తుందో ఒక మెట్రో ట్రిప్పు(రానుపొను)నకు అంత వినియోగమవుతుందన్నమాట. అంటే నాగోల్‌లో బయలుదేరిన మెట్రో రైలు రాయదుర్గం(28 కి.మీ) చేరేందుకు 450 యూనిట్లు.. అక్కడి నుంచి నాగోల్‌ చేరుకునేందుకు అంతే మొత్తంలో విద్యుత్‌ అవసరం. అంటే రానుపోనూ ఒక ట్రిప్పునకు 900 యూనిట్ల విద్యుత్‌ వినియోగం కానుంది.

అంతేకాదు ఎల్బీనగర్‌–మియాపూర్‌(29కి.మీ), జేబీఎస్‌–ఫలక్‌నుమా(15కి.మీ).. ఇలా దూరాన్ని బట్టి, రైలు ఆగే స్టేషన్లు, మలుపులను బట్టి విద్యుత్తు వినియోగ అవసరాలు భిన్నంగా ఉంటాయి. ఇక ఈనెల 28న ప్రారంభం కానున్న మియాపూర్‌–అమీర్‌పేట్‌(13 కి.మీ) వరకు రానుపోను ఒక ట్రిప్పు రైలు ప్రయాణించేందుకు 150 యూనిట్లు విద్యుత్‌ అవసరం. ఇక నాగోల్‌–అమీర్‌పేట్‌(17 కి.మీ)కు సుమారు 200 యూనిట్లు విద్యుత్‌ ఖర్చవుతుంది. ఇలా 20  రైళ్లు, రెండు మెట్రో డిపోలు, 24 స్టేషన్లలో రోజుకు 60 మెగావాట్ల విద్యుత్‌ అవసరమని మెట్రో అధికారులు చెబుతున్నారు. 2018 చివరి నాటికి మొత్తం 72 కి.మీ మార్గంలో మూడు కారిడార్ల ప్రాజెక్టు పూర్తయితే.. రెండు డిపోలు.. 64 స్టేషన్లకు, 57 రైళ్లను పూర్తిస్థాయిలో నడిపేందుకు నిత్యం 125 మెగావాట్ల విద్యుత్‌ అవసరమని అంచనా. 

నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఉప కేంద్రాలు..  
పట్టాలపైకెక్కిన మెట్రో రైళ్లు విద్యుత్‌ సరఫరా లోపంతో నిలిచిపోకుండా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాన్స్‌కోకు చెందిన 220 కేవీ ఉపకేంద్రం నుంచి దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ కరెంట్‌ను స్వీకరించి మెట్రో ప్రాజెక్టుకు సరఫరా చేస్తోంది. ఇందుకోసం నాలుగు 133 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాలను ఈ సంస్థ నిర్మించింది.  ఉప్పల్, మియాపూర్, ఎంజీబీఎస్, యూసుఫ్‌గూడలో 133 కేవీ రిసీవింగ్‌ సబ్‌స్టేషన్లు (ఆర్‌ఎస్‌ఎస్‌) నిర్మించారు. ఒక సబ్‌స్టేషన్‌లో సాంకేతికంగా అంతరాయం ఏర్పడినా.. మరొక సబ్‌స్టేషన్‌ నుంచి నిరాటంకంగా సరఫరా చేసేందుకు ఆయా కారిడార్లు, స్టేషన్లు, రైళ్లకు విద్యుత్‌ సరఫరా అయ్యేలా ప్రత్యేకంగా గ్రిడ్, వైరింగ్‌ ఏర్పాటు చేయడం విశేషం.

Advertisement

తప్పక చదవండి

Advertisement