ప్రభుత్వం ఎక్కడ? సాయం ఏది?

30 Apr, 2015 00:48 IST|Sakshi
ప్రభుత్వం ఎక్కడ? సాయం ఏది?

నేపాల్ భూకంప బాధితుల ఆగ్రహం
దేశ ప్రధాని ముందు నిరసన
6వేలు దాటిన మృతుల సంఖ్య

 
కఠ్మాండు: భారీ విపత్తు సంభవించి నాలుగు రోజులు గడుస్తున్నా కనీస సాయం అందకపోవడంపై నేపాల్ భూకంప బాధితుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. భారీ భూకంపంతో సర్వస్వం కోల్పోయి.. రోడ్డున పడిన తమను ఆదుకోవడంలో నేపాల్ ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు. చలిలో, వర్షంలో ఆరుబయటే జీవనం సాగిస్తున్న తమకు కనీస నిత్యావసరాలు అందించలేకపోతోందని నిందిస్తున్నారు. ఫలితంగా, సహాయ చర్యల పర్యవేక్షణకు, బాధితుల పరామర్శకు బుధవారం సహాయ క్యాంపుల వద్దకు వచ్చిన నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా బాధితుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.


భూకంపం వచ్చి నాలుగు రోజులవుతు న్నా.. సహాయచర్యలు మారుమూల ప్రాంతాలకు చేరడం లేదు. ఆహారం, తాగునీరు, ఇంధనం, పాలు, ఔషధాలు.. పూర్తిస్థాయిలో బాధితులకు చేరడం లేదు. దాంతో పలుచోట్ల సహాయ సామగ్రిని తీసుకెళ్తున్న వాహనాలపై దాడులు చేసి, ఆహార పొట్లాలు, తాగునీటి సీసాలను తీసుకెళ్లిపోతున్నారు. బాధితులు, పోలీసుల మధ్య బుధవారం కఠ్మాండు బస్ స్టేషన్ సహా పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భూకంప మృతుల సంఖ్య బుధవారం నాటికి 6వేలు దాటిందని నేపాల్ ఉపప్రధాని గౌతమ్ తెలిపారు. 10వేల మందికి పైగా గాయపడ్డారన్నారు. భారత్ అందిస్తున్న సాయానికి నేపాల్ ప్రధాని సలహాదారు దినేశ్ భట్టారాయ్ కృతజ్ఞతలు తెలిపారు.


భూకంప ప్రభావం తీవ్రంగా ఉన్న గోర్ఖా, ధాదింగ్, తదితర జిల్లాల్లోని మారుమూల పర్వతప్రాంతాలకు చేరుకునేందుకు సహాయ బృందాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారీ వర్షం, విరిగిపడ్తున్న కొండచరియలు సహాయచర్యలను అటంకపరుస్తున్నాయి. నేపాల్‌ను అంటువ్యాధుల రూపంలో మరో విపత్తు తరుముకొస్తోంది. భూకంపం తర్వాత పారిశుద్ధ్యలోపం, శుద్ధి చేయని తాగునీరు తదితర కారణాల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


కఠ్మాండు, గోర్ఖాలపైనే దృష్టి: భారత సహాయ బృందాలు భూకంప నష్టం తీవ్రంగా ఉన్న కఠ్మాండు, భూకంప కేంద్రప్రాంతమైన గోర్ఖా జిల్లాపై దృష్టి పెట్టాయి. జాతీయ విపత్తు స్పందన దళానికి చెందిన 500 మంది సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. భూకంపంలో ఇప్పటివరకు 15 మంది భారతీయుల మృతదేహాలను వెలికితీశారు. నేపాల్‌కు రూ. 2,630 కోట్ల తక్షణ సాయం అవసరమని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.  

‘కష్ట మండపం’ నేలమట్టం: భూకంపం ధాటికి ప్రఖ్యాత ‘కష్టమండప’ దేవాలయం నేలమట్టమైంది. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రక నిర్మాణం పేరుపైనే నేపాల్ రాజధానికి కఠ్మాండు అనే పేరు వచ్చింది. భూకంపం వచ్చినరోజే దర్బారా స్వ్కేర్ దగ్గరలో ఉన్న ఆ గుడి ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దాంతో శిథిలాల కిందపడి రక్తదాతలు, నర్సులు మృతిచెందారు.  

మూత్రపానంతో ప్రాణాలు నిలుపుకుని..!
‘చుటూ మట్టి దిబ్బలు.. తెగిపడిన శరీరావయవాలు.. భయంకరమైన కంపు వాసన.. కదలడానికి వీల్లేని పరిస్థితి.. స్లాబ్ మధ్య ఇరుక్కుపోయిన శరీరం.. సజీవంగా సమాధిలో ఉన్నట్లుగా ఉంది.. గంటలు గడిచిపోతున్నాయి..  ఆశలు అడుగంటిపోతున్నాయి.. దాహంతో నాలుక పిడచకట్టింది.. గోళ్లు రంగుమారుతున్నాయి.. చివరి క్షణాలు దగ్గరపడ్తున్న విషయం అర్థమవుతోంది.. అయినా ఎక్కడో చిన్న ఆశ.. ఎవరైనా వచ్చి రక్షించకపోతారా అని.. వారొచ్చేంతవరకైనా ప్రాణాలు నిలుపుకోవాలంటే దాహం తీరాలి.. కానీ ఈ పరిస్థితుల్లో దాహం తీరేదెలా? ఒకటే మార్గం.. స్వమూత్రపా నం.. అదే చేసాను.. ప్రాణం నిలుపుకున్నాను’. 82 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకుని కొస ప్రాణాలతో బయటపడిన ఇరవై ఏడేళ్ల రిషీ ఖనాల్ ఒళ్లు గగొర్పొడిచే స్వానుభవం ఇది. భూకంపం వచ్చిన 3 రోజుల తరువాత ఫ్రెంచ్ దళాలు రిషీని రక్షించాయి.
 
ఇక కొండచరియల వంతు..!
రానున్న రెండు, మూడు వారాల్లో వేసవిలో వచ్చే భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటం, బురదతో కూడిన వరదలు నేపాల్‌ను మరింత అతలాకుతలం చేయనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేపాల్‌లో అధిక శాతం పర్వతపాద ప్రాంతం కావడంతో కొండచరియలు విరిగిపడే ముప్పు అధికమంటున్నారు. భూకంపం ఆ ముప్పును మరింత పెంచిందని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు