‘నేపాల్‌ కొత్త మ్యాప్‌కు రాజ్యాంగ సవరణ’

13 Jun, 2020 16:37 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌, నేపాల్‌ సరిహద్దు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. నేపాల్‌ పార్లమెంట్‌లో సవరించిన జాతీయ మ్యాప్‌కు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. కాగా పార్లమెంట్‌లో జాతీయ మ్యాప్‌కు రాజ్యాంగ సవరణ చేసే అంశంపై ఆ దేశ పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదటగా ప్రతినిధుల సభలో రాజ్యాంగ సవరణకు సంబంధించిన చర్చ జరుగుతుందని.. చర్చ పూర్తయిన వెంటనే ఓటింగ్‌ నిర్వహిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాము ఓటింగ్‌లో రాజ్యంగ సవరణకు మద్దతిస్తామని ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్‌ పేర్కొంది.

1816 సుగాలీ ఒప్పందం ప్రకారం లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు నేపాల్ భూభాగంలో ఉంటాయని నేపాల్‌ ప్రభుత్వం వాదిస్తోంది. అందులో భాగంగనే సవరించిన ప్రాంతాలను కొత్త మ్యాప్‌లో పొందుపరిచామని తెలిపింది . ఇదే మ్యాప్ జాతీయ చిహ్నంలో కూడా ఉంటుంది. అయితే ఈ ప్రాంతాలకు సంబంధించి నేపాల్ వాదనలను భారత్ తిరస్కరిస్తోంది. దేశానికి చెందిన ఉత్తరాఖండ్‌ ప్రాంతాలను నేపాల్‌ కొత్త మ్యాప్‌లో పొందుపరిచారని భారత్‌ విమర్శిస్తోంది. కాగా 1962 సంవత్సరంలో చైనాతో భారత్‌ యుద్దం జరిగిన సమయం నుంచే లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను కీలకంగా భారత్‌ భావిస్తోంది.

మరోవైపు  నేపాల్‌తో భారత్‌కు మంచి  సంబంధాలున్నాయని.. భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక, మతపరమైన అంశాలు ఒకే విధంగా ఉంటాయని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ నరవాణే పేర్కొన్నారు. కాగా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే.. 275 మంది సభ్యుల కలిగిన దిగువ సభలో మూడింట రెండొంతుల మెజారిటీ రావాలని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. బిల్లు దిగువ సభ ఆమోదం పొందిన వెంటనే జాతీయ అసెంబ్లీకి చెరుకుంటుంది. అక్కడ కూడా దిగువ సభ అవలంభించే ప్రక్రియనే అమలు చేస్తారని పేర్కొంది.(చదవండి: చైనా వివాదాస్పద చట్టానికి నేపాల్‌ మద్దతు!)

మరిన్ని వార్తలు