భవిష్యత్‌లో అమెరికాకు చైనాతో చుక్కలే..!

28 Aug, 2019 11:22 IST|Sakshi

వాషింగ్టన్‌ : రష్యాతో కుదుర్చుకున్న ఆయుధ నియంత్రణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో ఇప్పుడు మరో ఆయుధ పోటీని ప్రపంచం చూడబోతోంది. అయితే ఈ ఆయుధ పోటీలో ఈసారి అమెరికాకు రష్యా కన్నా చైనా నుంచే పోటీ తీవ్రంగా ఉండబోతోంది. గతవారం అమెరికా తొమహాక్‌ క్రూయిజ్‌ మిసైల్‌ను పరీక్షించడంతో మాస్కో భగ్గుమంది. ఇది తమతో 1987లో కుదుర్చుకున్న మధ్యస్థ శ్రేణి అణ్వాయుధ ఒప్పందం ఉల్లంఘన కిందకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్రంగా స్పందించారు. పోలండ్‌, రొమేనియా దేశాలలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా క్షిపణి లాంచర్లు మోహరించిందని ఆరోపిస్తూ.. దీనికి దీటైన రీతిలో ‘ప్రతిస్పందన’ ఉంటుందని హెచ్చరించారు. అమెరికా చర్యలు ‘నియంత్రించలేని ఆయుధాల పోటీకి కేవలం అడుగు దూరంలో ఉన్నాయని’ వాఖ్యానించారు. రష్యా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో విప్లవాత్మక రీతిలో ఆయుధాలు తయారుచేశారు. వాటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక చైనా రూపంలో అమెరికాకు మరో పోటీదారుడు వచ్చాడు. గత దశాబ్ధ కాలంగా ఈ రెండు దేశాల మధ్య కనిపించని ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచంపై పట్టు నిలపుకునేందకు ఒకరు.. పట్టు సాధించేందుకు ఒకరు.. నువ్వా? నేనా? అన్నట్లు ఆయుధాల తయారీకి  సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ పోటీ అమెరికా, రష్యాల ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి మిసైల్‌, అణ్వాయుధ పోటీకన్నా మరింత తీవ్రంగా ఉండనుంది. కృత్రిమ మేధస్సు, అంతరిక్షం, హైపర్‌సోనిక్‌ ఆయుధాలు నయా ప్రచ్ఛన్న యుద్ధానికి కేంద్రంగా మారనున్నాయి.

కృత్రిమ మేధస్సును నూతన ఆయుధాల తయారీకి, సాంకేతికీకరణకు కీలకమలుపుగా చెప్పవచ్చు. గన్‌ పౌడర్‌, అణ్వాయుధాలు యుద్ధరంగంలో తెచ్చిన మార్పుల కన్నా కృతి​మ మేధస్సుతో కూడిన ఆయుధాలే ప్రస్తుతం యుద్ధరంగంలో సమూల మార్పులు తీసుకురానున్నాయి. ఇప్పుడు ఈ దిశగానే అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ఎవరైతే మొదట ఈ సాంకేతికతను అందిపుచ్చుకుంటారో ఆ దేశమే అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవిస్తుందని సైనిక పాటవ విశ్లేషకులు అంటున్నారు.

ఇక మరో కీలకమైన రంగం అంతరిక్షం. ప్రస్తుతం అంతరిక్షంలో యుద్ధాలకు అవకాశం లేకున్నా ఆ దిశగా అడుగులు ఎప్పుడో పడ్డాయి. అంతరిక్షంలో సైనికకార్యకలాపాలపై అగ్రరాజ్యాలు నిషేద ఒప్పందాలు చేసుకున్నా అమెరికా ఇప్పటికే అంతరిక్ష రంగాన్ని సైనికీకరించడం మొదలుపెట్టిందనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ రంగంలో కీలకమైన ‘అంతరిక్ష విమానాల’ తయారీలో పట్టు సాధించిన వారిదే ఆధిపత్యం. ఈ టెక్నాలజీతోనే హైపర్‌సోనిక్‌ విమానాలు, క్షిపణులు, నెలల తరబడి ఆకాశంలో ఉండగల డ్రోన్‌లు, రొబోట్‌లు తయారు చేస్తారు. ఈ టెక్నాలజీపై చైనా చాలా ఆసక్తిని కలిగి ఉంది. ఇప్పటికే ఈ తరహా ప్రయోగాలపై అమెరికాకు అందనంత రీతిలో ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేస్తోంది. ఇది చదవండి : జీ7 వేదికగా అమెరికాకు అవమానం!

కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా సైనిక శక్తిని పునర్‌నిర్మించడానికి అత్యధిక బడ్జెట్‌ కేటాయించారు. సైనిక బడ్జెట్‌ కేటాయింపుల్లో చైనా రెండో స్థానంలో ఉంది. అంత స్థాయిలో కాకున్నా తమ పూర్వ శక్తితో ఇంకా బలంగా ఉన్న రష్యా కూడా తమ సైన్యాన్ని క్రమబద్దీకరిస్తోంది. అయితే రష్యా, చైనాలను ఎదుర్కొనే వ్యూహాలను రచించడంలో అమెరికా తమ మునుపటి ప్రాభవాన్ని ఇప్పటికే కోల్పోయిందని సైనిక నిపుణుల భావన. అందుకే ఆసియాలో మరో అగ్రరాజ్యంగా అవతరిస్తున్న భారత్‌ను మిత్రదేశంగా ఎంచుకొని బలాబలాల సమతుల్యతను కాపాడుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని అంటున్నారు.

Poll
Loading...
మరిన్ని వార్తలు