చిత్రం వెనుక కథ!

18 Jun, 2016 16:50 IST|Sakshi
చిత్రం వెనుక కథ!

కొత్తగా పుట్టిన పిల్లలు నిద్రలో నవ్వుతుంటే... వారికి గతజన్మలో విషయాలు గుర్తుకొస్తాయని , దేవుడే ఆ చిన్నారులను నవ్విస్తాడని  వారి వారి నమ్మకాలను బట్టి చెప్తుంటారు. అయితే ఫేస్ బుక్ లో ఇటీవల కనిపించిన ఓ పసిపాప చిత్రం.. కోట్ల హృదయాలను కొల్లగొట్టింది.  కొత్తగా లోకంలో అడుగుపెట్టి, నిద్రలోనే బోసినవ్వులను కురిపిస్తూ కనిపించిన ఆ ఫోటో వెనుక కథ ఎందరినో కదిలింప జేసింది.  సుమారు నలభై లక్షలమంది లైక్ చేసిన చిత్రం.. ఎనభైవేల సార్లు షేర్ కూడ అయ్యింది. ఇంతకూ ఆ చిత్రం వెనుక కథేమిటో చూద్దామా.

తొమ్మిది నెలలు మోసి కని పెంచే తల్లితోపాటు, కంటికి రెప్పలా కాపాడే తండ్రి స్పర్శకు సంబంధించిన విషయం.. ప్రతి గుండెను తట్టింది. లోకం తెలీని పసిపాప ప్రస్తుతం నిద్రలో నవ్వులు చిందిస్తున్నా... ఊహ తెలిపిన తర్వాత ఎంత వేదన పడుతుందో అంటూ సానుభూతి వ్యక్తమౌతోంది.  ఆమె పుట్టడానికి కేవలం నెల రోజుల ముందు బైక్ రేసర్ అయిన తండ్రి చనిపోయినా.. అతడు వాడిన గ్లౌజ్ లు, హెల్మెట్ స్పర్శతోనే ఆమె నిద్రలో నవ్వులు పూయించడం ఓ మిరాకిల్ గా మారింది.

మోటార్ సైకిల్ రేస్ అంటే అమితంగా ఇష్టపడే హెక్టార్ డానియల్ ఫెర్రర్ అల్వరేజ్ ఫ్లోరిడాలో ఏప్రిల్ నెలలో స్నేహితుడి చేతులో హత్యకు గురయ్యాడు. ఆయన జ్ఞాపకాలను మరచిపోలేని  అల్వరేజ్ భార్య..  కేథరిన్ విలియమ్స్.. ఆయన వాడిన  గ్లౌజ్ లు , హెల్మెట్ ను అతడి ప్రేమకు గుర్తుగా భద్రపరచుకుంది. నెలరోజుల తర్వాత ఆయన గుర్తుగా  బిడ్డ ఆబ్రే పుట్టినా... మామూలు ప్రపంచంలోకి రాలేకపోయింది. భర్తను తలచుకొంటూ, అతడి ప్రేమకు గుర్తుగా గ్లౌజ్ లు, హెల్మెట్ దాచుకుంది. బిడ్డను హత్తుకున్నట్లుగా, తండ్రి చేతుల్లోనే నిద్రపోతున్నట్లు గ్లౌజ్ లు, హెల్మెట్ బిడ్డను హత్తుకున్నట్లుగా పెట్టి ఫోటోలు తీయించింది. గాఢంగా నిద్రపోతున్న ఆ పసిపాప.. తండ్రి గ్లౌజుల స్పర్మ తగలగానే చిరునవ్వులు ప్రారంభించిందని, నిజంగా ఆ సన్నివేశం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందంటూ ఫోటోగ్రాఫర్ కిమ్ స్టోన్ వివరించాడు. పసిపాప అమ్మమ్మ ఫోటో సెషన్ కోసం తనను బుక్ చేసిందని, చిన్నారి పుట్టక ముందే ఆమె తండ్రి చనిపోయినట్లు ఆవిడ చెప్పిందని, ఆ సన్నివేశాలు చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలను తీయాలంటూ తనను బుక్ చేశారని కిమ్ స్టోన్ తెలిపాడు. కుమార్తెను నిజంగా పట్టుకున్నట్లు గ్లౌజ్ లను పెట్టగానే..పసిపాప బోసి నవ్వులు చిందించడం ఆశ్చర్యం కలిగించినట్లు కిమ్ చెప్తున్నాడు.

అలా కిమ్ తీసిన ఫోటోల్లోని ఓ చిత్రమే ఇప్పుడు ఫేస్ బుక్ లో వైరల్ గా మారింది. ఫొటో వివరాలను చెప్తూ కిమ్... సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతి తక్కువ వ్యవధిలో కోట్లకొద్దీ మనసులను దోచుకుంది. ఆ చిట్టితల్లి చిరకాలం అలా నవ్వుతూనే ఉండాలంటూ ప్రతి మనసూ కోరుకుంది. స్టోన్ పోస్ట్ కు స్పందించిన విలియమ్స్.. అలాగే తన చిన్నారికి జీవితాంతం ప్రపంచవ్యాప్తంగా అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆయనకు సందేశాన్ని పంపింది. తన బిడ్డ కోసం ప్రపంచం ఎంత ప్రార్థించిందో ఆమె పెద్దయిన తర్వాత చూపిస్తానంటూ  విలియమ్స్ తన సందేశంలో వివరించింది. తండ్రి కలలను ఫోటో నిజం చేసిందని, ఆయన చనిపోయినా చిరస్థాయిగా నిలిచేట్టు చేసిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. నిద్రలో నవ్వుతుంటే పసిపాపలకు దేవుళ్ళు కనిపిస్తారంటారు... అది  నిజంగా నిజమేనేమో అంటూ స్టోన్ వ్యాఖ్యానించగా.. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఫోటోను చూసి, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తండ్రి పాత్రకు తగిన గుర్తింపునిచ్చే ఉద్దేశ్యంతో సోనారా.. జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డే పండుగ వెలుగు చూసేలా చేస్తే... అదే సమయంలో.. తండ్రి స్పర్శ, జ్ఞాపకాలకు సంబంధించిన గుర్తులతో 'ఆబ్రే' ఫోటో  సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం.. అందమైన 'ఫాదర్స్ డే' ఉత్సవానికి మరో మచ్చుతునకైంది.

మరిన్ని వార్తలు