కారులో మహిళ బిగుసుకుపోయిందని వెళ్తే..

19 Dec, 2016 08:44 IST|Sakshi
కారులో మహిళ బిగుసుకుపోయిందని వెళ్తే..
ఒక కారు రోడ్డు మీద పార్క్ చేసి ఉంది. అందులో మహిళ బిగుసుకుపోయి కనపడింది. బహుశా మంచు వల్ల చలి ఎక్కువై ఆమె అలా అయిపోయి ఉంటుందని పోలీసులు కంగారు పడ్డారు. హడావుడిగా వెళ్లి అద్దాలు పగలగొట్టారు. తీరా చూస్తే లోపల ఉన్నది మహిళ కాదు.. అచ్చం మనిషిలాగే కనిపిస్తున్న బొమ్మ!! దాన్ని చూసి న్యూయార్క్ పోలీసులు కంగుతిన్నారు. హడ్సన్ నగరంలో రోడ్డు మీద పార్క్ చేసి ఉన్న కారులో ఎవరో మహిళ చనిపోయి, బిగుసుకుపోయినట్లు కనిపిస్తోందని గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు అక్కడకు వెళ్లి చూడగా, మంచుతో కప్పబడిపోయి ఉన్న కారు కనిపించింది.
 
రాత్రి దాదాపు -13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న సమయం నుంచి దాన్ని అక్కడే వదిలేసినట్లు తెలిసింది. కారు మీద దట్టంగా మంచు పేరుకుపోయింది. కారు లోపల ఆక్సిజన్ మాస్కు ధరించి, ఏమాత్రం కదలిక లేకుండా ఆ మహిళ బొమ్మ కనిపించింది. ఆ బొమ్మకు అచ్చం మనిషిలాగే దుస్తులు, బూట్లు వేసి, కళ్లజోడు పెట్టారు. చివరకు సీట్ బెల్టు కూడా బిగించి ఉంది. దాంతో లోపలున్న మహిళను రక్షించాలని అద్దాలు పగలగొట్టి చూశారు. తీరా చూస్తే బొమ్మ అని తేలింది.
 
కానీ తన కారు అద్దాలు పగలగొట్టారంటూ పోలీసులపైనే కారు యజమాని ఫిర్యాదుచేశాడు. ఆ బొమ్మను తాను ఒక మెడికల్ ట్రైనింగ్ పరికరంగా ఉపయోగిస్తున్నట్లు చెప్పాడు. అయితే.. అర్ధరాత్రి 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో ఎవరైనా కార్లను ఇలాగే వదిలేసి, అందులో అచ్చం మనిషిలాగే కనపడే బొమ్మలను ఉంచితే వాటి అద్దాలు తాము తప్పక పగలగొడతామని పోలీస్ చీఫ్ ఎల్ ఎడ్వర్డ్ మూర్ తెలిపారు. 
>
మరిన్ని వార్తలు