అణు పరీక్షలకు స్వస్తి

22 Apr, 2018 02:30 IST|Sakshi

సంచలన నిర్ణయం తీసుకున్న ఉ.కొరియా

మూన్, ట్రంప్‌లతో కిమ్‌ భేటీకి ముందు కీలక పరిణామం

సియోల్‌: నిత్యం ఏదో ఒక ఆయుధ పరీక్షతో ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఉత్తర కొరియా ఎట్టకేలకు దిగొచ్చింది. అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో అంతర్జాతీయ సమాజం ఆ దేశంపై విధించిన కఠిన ఆంక్షలు ఫలించినట్లయింది.

త్వరలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే–ఇన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ భేటీ కానున్న నేపథ్యంలో శనివారం ఈ ప్రకటన వెలువడింది. ఈ వారమే కిమ్‌–మూన్‌ల భేటీ జరగనుండగా, ట్రంప్‌–కిమ్‌ల సమావేశం ఎప్పుడు జరుగుతుందో ఇంకా తేదీ ఖరారు కాలేదు. అణు, క్షిపణి పరీక్షలకు స్వస్తి పలుకుతామన్న కిమ్‌..ఇప్పటికే అభివృద్ధిచేసిన అణ్వాయుధాలు, క్షిపణులను త్యజించడంపై స్పష్టత ఇవ్వలేదు. అణు పరీక్షలకు వినియోగించిన ప్రయోగ కేంద్రాన్ని మూసివేస్తామని తెలిపారు. ఉ.కొరియా నిర్ణయాన్ని అమెరికా, జపాన్, చైనా, ఈయూ స్వాగతించాయి.

ఇక వాటి అవసరం లేదు: కిమ్‌
అధికార వర్కర్స్‌ పార్టీ ప్లీనరీ సమావేశంలో సభ్యులకు కిమ్‌ తన నిర్ణయాన్ని తెలిపినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ(కేసీఎన్‌ఏ) వెల్లడించింది. ‘ అవసరమైన ఆయుధాలను ఇప్పటికే తయారుచేసుకున్నాం. క్షిపణులపై అమర్చే సూక్ష్మ వార్‌హెడ్లను కూడా అభివృద్ధి చేసుకున్నాం. ఇక మ నకు అణు పరీక్షలు, మధ్యంతర, ఖండాంతర క్షిపణుల అవసరం లేదు’ అని కిమ్‌ అన్నారు.

అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి పరీక్షలను శనివారం నుంచి నిలిపేయాలని పార్టీ నిర్ణయించింది. భావి తరాలు గౌరవప్రద, సంతోషకర జీవితం గడపటానికి ఇప్పటికే అభివృద్ధిచేసిన అణ్వాయుధాలు భరోసా కల్పిస్తాయని కిమ్‌ వ్యాఖ్యానించారు. దేశాన్ని అణుశక్తిగా నిర్మించాలన్న లక్ష్యం నెరవేరిందని, ఇక పరిపుష్ట ఆర్థిక వ్యవస్థను తయారుచేసుకోవడంపై దృష్టిపెట్టనున్నట్లు వెల్లడించారు.

గొప్ప పురోగతి: అమెరికా
ఉ.కొరియా నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ట్రంప్‌ స్పందించారు. ‘ఈ నిర్ణయం ఉ.కొరియాకే కాదు మొత్తం ప్రపంచానికి మేలు చేస్తుంది. ఇది గొప్ప పురోగతి. కిమ్‌తో సమావేశానికి ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు. ఈ పరిణామాన్ని దక్షిణ కొరియా స్వాగతిస్తూ కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ దిశగా పడిన కీలక ముందడుగు అని వ్యాఖ్యానించింది. ఉ.కొరియా నిర్ణయం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించి, రాజకీయ స్థిరత్వానికి దోహదపడుతుందని మిత్ర దేశం చైనా పేర్కొంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు