ఫేస్‌ తెలీకపోయినా.. మనసు గ్రహిస్తుంది

22 Apr, 2018 02:26 IST|Sakshi

యూజర్లపై ఫేస్‌బుక్‌ వాణిజ్య వల 

మీకు వంటలంటే ఇష్టమా? ఫేస్‌బుక్‌లో వంటలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూస్తుంటారా? అలాగైతే ఫుడ్‌కి సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్స్‌ మీ వాల్‌పై ఎప్పుడైనా గమనించారా? 
మీకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువా? ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయమైనా పోస్టు లేదా షేర్‌ చేస్తూ ఉంటారా? అలాగైతే ఆరోగ్య ఉత్పత్తుల యాడ్స్‌ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉండాలి..!  
మా ఇష్టాయిష్టాలు ఫేస్‌బుక్‌కు ఎలా తెలుసు..? అని ఆశ్చర్యపోకండి ఇదో వాణిజ్య వల..!!  

మీ అలవాట్లు, అభిరుచులు, ఇష్టాయిష్టాలన్నింటినీ గ్రహించి, వాటిని క్రోడీకరించి వాణిజ్య ప్రకటనదారుల చేతుల్లో పెట్టేస్తోంది ఫేస్‌బుక్‌. తద్వారా తాను సొమ్ము చేసుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జనం నాడి పసిగట్టి తాను యాడ్స్‌ రూపంలో కోట్లు కొల్లగొడుతోంది. వాణిజ్య ప్రకటనల ఆదాయంలో గూగుల్‌ తర్వాత స్థానం ఫేస్‌బుక్‌దే.. ప్రజల అలవాట్లనే తన ఆదాయానికి మార్గం చేసుకుని 400 కోట్ల డాలర్ల యాడ్‌ రెవెన్యూ సాధించింది. కేంబ్రిడ్జి ఎనలిటికా డేటా లీకేజీ వ్యవహారం తర్వాత ఫేస్‌బుక్‌ వినియోగదారుల్ని ఎలా ఆకర్షిస్తోందన్న అంశంలో ఆసక్తి అందరిలోనూ పెరిగింది. 

మీ ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం మొత్తాన్ని అంచనా వేస్తుంది. మీరు ఏ కంపెనీలో పని చేస్తున్నారు? ఏ కాలేజీలో చదివారు.. మీ విద్యార్హతలు.. మీరు రిలేషన్‌లో ఉన్నారా? వంటి అంశాల ద్వారా మీరు ఎలాంటి విషయాలకు ఆకర్షితులవుతారో గ్రహిస్తుంది. మీ స్మార్ట్‌ ఫోన్‌లో లొకేషన్‌ ఆప్షన్‌ ఆన్‌ అయి ఉంటే చాలు.. అడుగు తీసి అడుగు వేసినా ఫేస్‌బుక్‌ పసిగట్టేస్తుంది. మీరు ఏయే ప్రాంతాలకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? వంటి విషయాల ద్వారా మీ అభిరుచుల్ని తెలుసుకుంటుంది. ఆన్‌లైన్‌లో మీరు చేసే బుకింగ్‌ల ద్వారా మీకున్న ఇష్టాయిష్టాలపై ఒక అంచనాకి వస్తుంది. మీరు చేసే పోస్టులు, షేర్‌ చేసే విషయాలు, కొట్టే లైక్‌లు, పెట్టే కామెంట్స్‌ కూడా ఫేస్‌బుక్‌ రూపొందించే మార్కెట్‌ వ్యూహాలకు ముడిసరుకులే. చివరికి మీ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులని బట్టి మీకున్న ఆసక్తుల్ని పట్టేయగలదు.

ఇదంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా చేస్తూ మార్కెటింగ్‌ కంపెనీలకు సమాచారాన్ని అందించడం ద్వారా వాణిజ్య ప్రకటనల్ని తెచ్చుకుంటోంది. అంతేకాదు వాణిజ్య ప్రకటనదారుల కోసం ఫేస్‌బుక్‌ పిక్సెల్‌ అనే టూల్‌ని రూపొందించింది. ఎఫ్‌బీకి యాడ్స్‌ ఇవ్వాలనుకునే కంపెనీలు ఈ టూల్‌ని తమ వెబ్‌సైట్‌లో పెట్టడం ద్వారా వినియోగదారుల ప్రతీ చర్యా తెలుసుకోగలరు. మీ వాల్‌ మీదనున్న యాడ్‌ను క్లిక్‌ చేసిన తర్వాత మీరేం చేసినా పిక్సెల్‌ టూల్‌తో తెలిసిపోతుంది. అలా తెలుసుకున్న సమాచారంతో ప్రకటనదారులు తమ యాడ్స్‌కి మరింత మెరుగులు దిద్దుతారు. రీ టార్గెటింగ్‌ అనే టూల్‌ ద్వారా మీకు ఇష్టమైన ఉత్పత్తుల్ని గ్రహించుకుని, వాటిని మీరు కొనేలా ఉసిగొల్పుతారు. ఇలా కనీసం మీ ఫేస్‌ తెలీకపోయినా, మీ మనసు గ్రహిస్తుంది.. అదే ఇప్పుడు ఫేస్‌బుక్‌కు పెట్టుబడి. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా