దాయాది దేశంపై మండిపడ్డ ఉత్తర కొరియా

8 May, 2020 17:17 IST|Sakshi

సైనిక విన్యాసాలు నిర్వహించి ఒప్పందాన్ని ఉల్లంఘించారు!

ప్యాంగ్‌యాంగ్‌: సముద్ర సరిహద్దులో సైనిక విన్యాసాలు నిర్వహించి దక్షిణ కొరియా దుస్సాహసానికి పూనుకుందని ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి ఘటనలు ఘర్షణకు దారి తీస్తాయని.. కవ్వింపు చర్యలకు పాల్పడితే ధీటుగా బదులిస్తామని శుక్రవారం దాయాది దేశాన్ని హెచ్చరించింది. పశ్చిమ సముద్ర సరిహద్దుల్లో యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు మోహరిస్తూ 2018 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడింది. ​పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము రంగంలోకి దిగక తప్పదని.. ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలకు తాము బాధ్యులం కాబోమని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర కొరియా సాయుధ బలగాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. (జిన్‌పింగ్‌పై కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రశంసలు!)

దక్షిణ కొరియా కౌంటర్‌
ఇక ఈ విషయంపై స్పందించిన దక్షిణ కొరియా రక్షణ శాఖ.. తమ ఆధీనంలోని పశ్చిమ జలాల్లో సైనిక విన్యాసాలు నిర్వహించడం నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది. సరిహద్దుకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో తమ మిలిటరీ డ్రిల్‌ కొనసాగిందని పేర్కొంది. 2018 నాటి ఒప్పందానికి కట్టుబడి ఉంటూనే తమ సైన్యం శత్రుదేశాల కుయుక్తులను తిప్పికొట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కౌంటర్‌ ఇచ్చింది. కాగా ఉభయ కొరియా దేశాల సరిహద్దుల్లో ఆదివారం కాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఉత్తర కొరియా సైనికులు తమ సరిహద్దు లోపల తుపాకీ కాల్పులు జరపగా.. ఇందుకు హెచ్చరికగా తాము 20 రౌండ్ల కాల్పులు జరిపామని దక్షిణకొరియా వెల్లడించింది. అయితే ఈ కాల్పుల్లో తమకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. (కిమ్‌కి శస్త్ర చికిత్స జరిగిందా ?)

అదే విధంగా ఈ విషయాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లగా అటు నుంచి ఇంతవరకు సమాధానం రాలేదని పేర్కొంది. కాగా 1950-53 మధ్య జరిగిన కొరియన్‌ యుద్ధం ముగిసిన నాటి నుంచి దాయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు మద్దతుగా దాదాపు 28 వేల అమెరికా సైనిక బలగాలు అక్కడే ఉండి ఉత్తర కొరియా దూకుడుకు ఎప్పటికప్పుడు కళ్లెం వేస్తున్నాయి. ఇక యువ నాయకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టిన తర్వాత 2018లో దాయాది దేశ అధ్యక్షుడితో మూడు దఫాలుగా సమావేశమై ఒప్పందం(కాల్పుల విరమణ) కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కిమ్‌ ఆరోగ్యం క్షీణించిందనే వార్తల నేపథ్యంలో సరిహద్దుల్లో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.(కిమ్ తిరిగి రావడంపై ట్రంప్‌ ట్వీట్‌) 

మరిన్ని వార్తలు