ఇక సిలికాన్తో పనిలేదోచ్..!

20 Apr, 2016 18:09 IST|Sakshi

బోస్టన్: సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో సిలికాన్ లేదా కాపర్ మెటీరియల్ ను ఉపయోగించడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ, బొగ్గు పొరలను ఉపయోగించి పనిచేసే ఎలక్ట్రానిక్ హీటింగ్ డివైజ్ను అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ రంగంలోని మరిన్ని పరికరాల తయారీలో బొగ్గును ఉపయోగించవచ్చని చెబుతున్నారు.

బొగ్గు ఉపయోగాలను పరిశీలించిన శాస్త్రజ్ఞులకు క్రమంగా సాధారణ మెటీరియల్స్తో పోల్చితే బొగ్గు మాలిక్యులర్ కాంప్లెక్సిటీలో భారీ తేడా కనిపించడంతో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ వినియోగంలో వాడి విజయం సాధించారు. ఇప్పటివరకు బొగ్గుతో తయారుచేసిన ఎలక్ట్రికల్ హీటింగ్ డివైజ్ను కార్లు, విమానాలు కిటికీలు, రెక్కల్లో ఉపయోగించారు.

మొదటి దశలో బొగ్గులో ఉండే ఆంథ్రసైట్, లిగ్నైట్, రెండు బైట్యుమినస్ రకాల ప్రాపర్టీల్లో తేడాలను గమనించిన పరిశోధకులు సహజసిద్ధంగా లభించే బొగ్గులో ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ తయారీకి కావలసిన అన్నీ గుణాలు కలిగి ఉన్న దాన్ని ఎంపిక చేసుకున్నారు. తర్వాత ప్రత్యేక పద్ధతుల్లో బొగ్గును పొడిగా తయారుచేసి పలుచని ఫిల్మ్ మీద మిశ్రమాన్ని పోసి పొరలుగా తయారుచేసుకున్నారు.

ఈ పొరల్ని సాధారణంగా అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ తయారీ పద్ధతి ఫ్యాబ్రికేషన్లో సిలికాన్ స్థానంలో బొగ్గు పొరల్ని ఉంచారు. ఇలా మామూలు తయారీ పద్ధతిని ఉపయోగించి ప్రస్తుతం తయారవుతున్న అన్నీ ఎలక్ట్రానిక్ పరికరాల్లో దీనిని ఉపయోగించొచ్చని శాస్త్రజ్ఙులు చెబుతున్నారు. దీంతో సిలికాన్తో పోల్చితే తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను జర్నల్ నానో లెటర్స్లో ప్రచురించారు.

మరిన్ని వార్తలు