ప్యాంగ్‌యాంగ్‌కు క్షిపణుల తరలింపు

19 Oct, 2017 12:30 IST|Sakshi

సాక్షి, ప్యాంగ్‌యాంగ్‌ : తమను బాగా రెచ్చగొడుతున్న అమెరికాకు ఊహించని షాక్ ఇస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే మరో పరిణామం చోటు చేసుకుంది. రాజధాని ప్యాంగ్‌ యాంగ్‌కు క్షిపణులను తరలించటం ఆందోళన కలిగిస్తోంది. శాటిలైట్‌ వీక్షణలో ఈ విషయం వెలుగు చూడటం విశేషం.  ఈ నేపథ్యంలో అదను చూసుకుని కిమ్‌ సైన్యాలు అమెరికాపై విరుచుకుపడే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి.

అయితే అమెరికా ఎంత మాత్రం ఆవేశపడటం లేదు. ‘మొదటి బాంబు పడేవరకు’  దౌత్యపరమైనే చర్చల ద్వారానే ప్రయత్నిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా..  కొరియా ద్వీపకల్పంలో దక్షిణ కొరియాతో కలిసి అమెరికా భారీ ఎత్తున డ్రిల్స్ చేస్తుంది. నేవీ డ్రిల్స్ నిర్వహించడం తమను రెచ్చగొట్టేందుకు అమెరికా పన్నిన కుట్ర అని కిమ్‌ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు నేవీ డ్రిల్స్ ముగిసిన వెంటనే దక్షిణకొరియాతో మరో డ్రిల్‌ ను అమెరికా నిర్వహించనుందన్న వార్తల నేపథ్యంలో. అమెరికా ఇలాంటి చర్యలను కొనసాగిస్తే...ఆదేశం ఊహించని సమయంలో ఊహకందని విధంగా దాడులు చేస్తామని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

ప్రతి రెండేళ్లకోసారి దక్షిణకొరియా, అమెరికాలు సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న విన్యాసాలు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నాయని ఉత్తర కొరియా ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నడుమ ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కుళ్లుతోనే అమెరికా ఆరోపణలు...

తమ దేశం అభివృద్ధిని చూసి ఓర్వలేక అమెరికా ఆరోపణలు చేస్తోందని ఉత్తర కొరియా అంటోంది. ఐక్యరాజ్యసమితిలో ఉత్తర కొరియా రాయబారి కిమ్ రోయాంగ్ మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్లలో తమ దేశం ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు రచించిందని... కానీ, అమెరికా మాత్రం వాటిని వేరేలా అభివర్ణిస్తోందని అన్నారు. ఆర్థికంగా బలపడేందుకు తమ అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌ వినూత్న కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్తుంటే.. అమెరికా కుళ్లుకుంటుందని రోయాంగ్ విమర్శించారు. అమెరికా ఆరోపణల ఆధారంగానే ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు కూడా తమ దేశాన్ని అనుమానిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని రోయాంగ్ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు