వేలల్లో కాసే ఆక్టోపస్ టమాటా చెట్లు..!

4 Aug, 2016 22:08 IST|Sakshi
వేలల్లో కాసే ఆక్టోపస్ టమాటా చెట్లు..!

ఒకే ఒక్క చెట్టుకు సుమారు 32,000 టమాటాలు వరకూ కాయడం ఎక్కడైనా చూశారా?  40 నుంచి 50  చదరపు మీటర్ల పరిథిలో విస్తరించే ఆ అరుదైన హైబ్రీడ్ టమాటా మొక్కలు  ప్రతి సీజన్ లోనూ వేలాదిగా కాయడం వాల్డ్ డిస్నీవరల్డ్ రిసార్ట్ లో అమితంగా ఆకట్టుకుంటుంది. అయితే ఆ ఆక్టోపస్ చెట్లు ఏ ప్రాంతానికి చెందినవి అన్న వివరాలు మాత్రం పూర్తిగా అందుబాటులో లేకపోయినా.. ఇంటర్నెట్ ఆధారంగా తెలిసిన వివరాలను బట్టి అవి చైనాకి చెందినవిగా తెలుస్తోంది.

మొదటిసారి ఆక్టోపస్ టమోటా చెట్లను ఫోటోల్లో చూసిన ఓ వ్యక్తి.. వాటిపై అధ్యయనం మొదలు పెట్టాడు. ఒకే ఒక్క చెట్టు వేలల్లో కాయలు కలిగి ఉండటం బూటకం అనుకున్నానని, అయితే ఆఫోటోలు ఎంతో ఆకట్టుకోవడంతో ఆచెట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు కొన్ని గార్డెనింగ్ సైట్లలో తీవ్రంగా వెతికినా వాటి పెరుగుదల, విత్తనాలు, ఎక్కడ దొరుకుతాయి అన్నఇన్ఫర్మేషన్ పెద్దగా దొరకలేదని తెలిపాడు.  అనంతరం ఓ ట్రావెల్ బ్లాగ్ ద్వారా  అటువంటి ఆక్టోపస్ టమాటో చెట్లు వాల్ డిస్నీ వరల్డ్ రిసార్ట్ లో అందర్నీ ఆకట్టుకుంటున్నాయని తెలియడంతో అవి నిజమైన చెట్టుగా నమ్మకం కుదిరిందని తెలిపాడు. కానీ ఆ ఆక్టోపస్ టమాటా చెట్లను ఎలా పొందాలో తెలుసుకునేందుకు ఈబే, అలి ఎక్స్ ప్రెస్ వంటి  మరిన్ని వెబ్ సైట్లలో వెతికిన అతడు.. అక్కడ కొందరు ఆ మొక్కల అమ్మకాలు చేపడుతున్నట్లు తెలియడంతో.. ఆ అద్భుతమైన ఆక్టోపస్ టమాటా చెట్ల ఉనికి గురించి  తెలియనివారికి కూడా చెప్పాలనుకున్నాడు. తనకు తెలిసిన కొద్దిపాటి సమాచారం ప్రకారం అవి చైనాకు చెందినవిగా తెలుస్తోందని, దాన్ని నిర్థారించలేకపోతున్నట్లు తెలిపాడు. వాల్ డిస్నీ వరల్డ్ రిసార్ట్ థీమ్ పార్కుల్లో ఒకటైన ఎప్కాట్ కు చెందిన వ్యవసాయ శాస్త్ర మేనేజర్ యాంగ్ హాంగ్ ద్వారా  ఆక్టోపస్ టమాటా చెట్లు చైనా బీజింగ్ కు చెందినవిగా తెలిసిందని...,  ఫ్లోరిడా ఎంటర్ టైన్మెంట్ పార్కులో వాటిని ప్రదర్శనకు ఉంచిన సందర్భంలో అక్క్డడినుంచీ కొన్ని గింజలను తెచ్చిన యాంగ్.. వాటిని నాటి, కొంతమంది సహాయంతో పెంపకం చేపట్టినట్లు తెలుస్తోంది.

ఆక్టోపస్ టమాటో మొక్కలు పూర్తిశాతం పెరగడానికి సుమారు ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది. అయితే ఆ మొక్కలు మొదటి 7-8 నెలల వరకూ ఎటువంటి ఫలాలను ఇవ్వవు, పరిపక్వతకు చేరిన అనంతరం సగటున ఒక్కో కాపుకు 14,000 టమాటోల వరకూ పంట వస్తుంది. ప్రస్తుతం ఎప్ కాట్ లోని రెండు మొక్కల్లో ఒకటి ఇంచుమించుగా  522 కేజీల బరువైన 32,000 టమాటాలకు వరకూ కాసి, భారీ పంటను ఇచ్చిన మొక్కగా  గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించింది. ఈ మొక్కలు ఒక్కోటి సుమారు 40-50 చదరపు మీటర్లలో వ్యాపించి ఉండటం విశేషం. అయితే ఇటువంటి మొక్కలు పెంచుకోవాలనుకునేవారు వాల్ డిస్నీ రిసార్ట్ కు టూర్ వెళ్ళి, అక్కడి గ్రీన్ హౌస్, ల్యాబ్ లలో ఓ గంటపాటు కాలినడకన తిరుగుతూ వాటిని దగ్గరగా చూస్తూ గడపొచ్చు. అంతేకాదు.. వాటి కేర్ టేకర్లతో మొక్కల గురించిన వివరాలను మాట్లాడే అవకాశం కూడా ఉంది. అయితే వాల్ డిస్నీ రిసార్ట్ లో పండించే ఈ ఆక్టోపస్ టమాటాలు ఎప్ కాట్ లోని రెస్టరెంట్లలో కూడా విరివిగా వాడటం ఆసక్తికరంగా ఉంటుంది.

>
మరిన్ని వార్తలు