ప్రతీ అయిదుగురిలో ఒకరికి కోవిడ్‌ ముప్పు

17 Jun, 2020 05:16 IST|Sakshi

 తాజా అధ్యయనంలో వెల్లడి

లాన్సెట్‌లో ప్రచురితమైన నివేదిక

లండన్‌: ప్రపంచ జనాభాలో ప్రతీ అయిదుగురిలో ఒకరికి కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపుగా 170 కోట్ల మంది కరోనా ముప్పులో ఉన్నారని ఆ అధ్యయనం చెప్పింది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం నివేదికని ప్రఖ్యాత లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ మ్యాగజైన్‌ ప్రచురించింది. ప్రపంచ జనాభాలో 22 శాతం మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని, వారికి కోవిడ్‌–19 సోకితే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆ అధ్యయనం హెచ్చరించింది.

ఏయే వ్యాధులంటే..
టైప్‌ 2 డయాబెటిస్, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైరస్‌ ప్రమాదం అధికంగా ఉంటుంది. ఈ వ్యాధుల్లో ఏ ఒక్కటి ఉన్నా వారికి కరోనా వైరస్‌ సోకితే చాలా ప్రమాదంలో పడతారని శాస్త్రవేత్తలు తెలిపారు. గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజెస్, వివిధ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన గణాంకాల్ని విశ్లేషించి ఎంత మంది కోవిడ్‌ ముప్పులో ఉన్నారో శాస్త్రవేత్తలు అంచనాకొచ్చారు.

ముప్పు ఎవరికంటే ..
ప్రపంచ జనాభాలో 34.9 కోట్ల మంది అంటే నాలుగు శాతానికి పైగా జనాభాకి వైరస్‌ సోకితే ఆస్పత్రిలో చేర్చించాల్సిన అవసరం ఉందని లాన్సెట్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న వారిలో 20 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న వారు 5శాతం మంది ఉంటే, 70 ఏళ్లకు పై బడిన వారు 66 శాతం మంది ఉన్నారు. పురుషుల్లో 6శాతం మంది, మహిళల్లో 3 శాతం మందికి ముప్పు అధికంగా ఉంది. వృద్ధ జనాభా అధికంగా ఉన్న ఐరోపా దేశాలు, ఎయిడ్స్‌ వంటి వ్యాధులు విజృంభించే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, మధుమేహం వ్యాధి అధికంగా ఉన్న చిన్న దేశాలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న దేశాల్లో వైరస్‌ ప్రభావం చూపించే అవకాశ ముందని అధ్యయనకారులు వివరించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు