ఆన్‌లైన్ గేమ్స్ తో మెదడుకు పదును!

10 Aug, 2016 12:28 IST|Sakshi
ఆన్‌లైన్ గేమ్స్ తో మెదడుకు పదును!

సిడ్నీః ఇటీవల పెద్దా చిన్నా తేడాలేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లతో బిజీగా కనిపిస్తున్నారు. వారిలో ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్నవారు ఫేస్ బుక్, వాట్సాప్, ఈ మెయిల్ వంటి వాటికి అతుక్కుపోతున్నారు. అయితే సోషల్ మీడియాతో కాలం గడపడం ప్రతికూల ప్రభావాలను తెచ్చిపెడుతుందని, అంతకంటే ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడటం కొంతవరకూ ఉపయోగపడుతుందని చెప్తున్నారు పరిశోధకులు. ఆన్లైన్ వీడియో గేమ్స్ విద్యార్థుల్లో మెదడుకు పదును పెడతాయని, లెక్కలు, సైన్సు వంటి సబ్జెక్లుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయని తాజా అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు.

ఆటలు పిల్లలకు ఆరోగ్యాన్నిస్తాయన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ప్లేగ్రౌండ్స్ కు వెళ్ళి, ఆటస్థలాల్లోనూ ఆడుకునే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా చదువుకునే పిల్లలు కాస్త ఖాళీ దొరికితే టీవీల ముందు కూర్చోవడమో, స్మార్ట్ ఫోన్లు, మీడియాతో కాలక్షేపం చేయడమో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కంటే విద్యార్థులు వీడియో గేమ్స్ ఆడటం కొంతవరకూ పనికొస్తుందని చెప్తున్నారు తాజా అధ్యయనకారులు. ఆన్లైన్ వీడియో గేమ్స్ వల్ల  మెదడు చురుగ్గా పనిచేస్తుందని, విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగే అవకాశం ఉందని, చెప్తున్నారు. దాదాపు ప్రతిరోజూ ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడే విద్యార్థులు మిగిలిన వారితో పోలిస్తే గణితంలో 15, సైన్స్ లో 17 పాయింట్లు సగటున ఎక్కువగా స్కోర్ చేయగల్గుతున్నట్టు అధ్యయనాల్లో తెలుసుకున్నారు.

ముఖ్యంగా టీనేజర్లు ఆన్లైన్ గేమ్స్ ఆడటం, వాటిలోని పజిల్స్ పూర్తి చేయడం, నెక్స్ట్ లెవెల్ కు చేరుకోవడం వల్ల జనరల్ నాలెడ్జ్ పెరగడంతోపాటు, గణితం, సైన్సు వంటి సబ్జెక్టుల్లో మరింత నైపుణ్యాన్ని సంపాదించే అవకాశం ఉంటుందని ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఆర్ఎంఐటీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆల్బెర్టో పోసో చెప్తున్నారు. క్రమం తప్పకుండా సోషల్ మీడియా సైట్లు ఫాలో అయ్యేవారు పాఠశాల ఫలితాల్లో వెనుకబడి ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ప్రతిరోజూ ఫేస్ బుక్, ఛాట్ తో కాలం గడిపేవారు మిగిలిన వారితో పోలిస్తే మాథ్స్ లో 20 పాయింట్ల వరకూ వెనుకబడి ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే టీచర్లు విద్యార్థులకు ఉపయోగపడే వీడియో గేమ్స్ ద్వారా  బోధిస్తే.. వారికి కొంత వరకూ ఉపయోగకరంగా ఉండటంతోపాటు..సోషల్ మీడియా ప్రభావం వారిపై పెద్దగా ఉండదని  సూచిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ తో పరిచయం ఉన్న, 15 సంవత్సరాల వయసున్న 12,000 మంది విద్యార్థులపై నిర్వహించిన పరిశోధనల వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనికేషన్ లో నివేదించారు.

మరిన్ని వార్తలు