‘భారతీయ సినిమాలను నిషేధిస్తున్నాం’

27 Feb, 2019 11:55 IST|Sakshi

 పాక్‌ సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌

ఇస్లామాబాద్‌ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం మెరుపు దాడులు చేయడాన్ని పాకిస్తాన్‌ జీర్ణించుకోలేకపోతోంది. అంతర్జాతీయ సమాజం నుంచి తమకు మద్దతు లభించకపోవడంతో ఇప్పటికే సరిహద్దులో.. పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ సినిమాలపై మరోసారి నిషేధం విధించాలని పాక్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెరుపు దాడుల నేపథ్యంలో తమ దేశంలో భారత సినిమాలను ఆడనివ్వబోమని పాక్‌ సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ ప్రకటించారు. ఈ మేరకు... ‘ సినిమా ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌ ఇండియన్‌ సినిమాను బాయ్‌కాట్‌ చేసింది. ఇకపై పాకిస్తాన్‌లో ఒక్క భారతీయ సినిమా కూడా విడుదల కాదు. అదేవిధంగా భారత్‌లో నిర్మించిన ప్రకటనల ప్రదర్శన వ్యతిరేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు’ అని ట్వీట్‌ చేశారు.

కాగా 40 మందికి పైగా భారత జవాన్లను పొట్టబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ.. పాక్‌ నటులపై బాలీవుడ్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక మెరుపుదాడుల అనంతరం పాక్‌ నటుల వీసాలను నిరాకరించాలని సినీ వర్కర్ల సంఘం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. అజయ్‌ దేవగణ్‌ వంటి కొంతమంది హీరోలు తమ సినిమాలను పాకిస్తాన్‌లో విడుదల చేయమని స్వచ్ఛందంగానే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌ తాజా నిర్ణయం కారణంగా పాకిస్తాన్‌ నటులకే ఎక్కువ నష్టం ఉంటుంది గానీ భారతీయ సినిమాకు పెద్దగా ఇబ్బంది కలిగే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు