పాక్‌కు ‘పవర్‌ఫుల్‌’ క్షిపణి

23 Mar, 2018 00:56 IST|Sakshi

చైనా నుంచి కొనుగోలు

బహుళ వార్‌హెడ్లమిసైల్స్‌ అభివృద్ధికి ఊతం

హాంకాంగ్‌ పత్రిక కథనం

బీజింగ్‌: శత్రు దేశాల క్షిపణులను గుర్తించి ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్‌ చైనా నుంచి అత్యంత శక్తిమంతమైన క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసినట్లు తెలిసింది. బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే క్షిపణుల అభివృద్ధికి నాలుగు టెలిస్కోపులతో కూడిన అత్యాధునికమైన ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నారు. కొత్త క్షిపణులను పరీక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్‌ ఇప్పటికే దీన్ని రహస్య ప్రదేశంలో వినియోగంలోకి తెచ్చినట్లు వెల్లడైంది. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ (సీఏఎస్‌) పరిశోధకుడు ఒకరిని ఉటంకిస్తూ హాంకాంగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ గురువారం ఈ విషయాలను కథనం రూపంలో ప్రచురించింది. అయితే పాకిస్తాన్‌ ఈ కొనుగోలు ఒప్పందానికి ఎంత వెచ్చించిందో వెల్లడించలేదు.

అత్యాధునిక క్షిపణి నిఘా వ్యవస్థను పాకిస్తాన్‌కు చైనా అమ్మినట్లు సీఏఎస్‌ పరిశోధకుడు జెంగ్‌ మెంగ్వెయ్‌ రూఢీ పరచినట్లు ఆ పత్రిక పేర్కొంది. పాకిస్తాన్‌కు అంతటి శక్తివంతమైన ఆయుధాన్ని సమకూర్చిన తొలి దేశం చైనాయేనని సీఏఎస్‌ వెబ్‌సైట్‌లో సమాచారం ఉంది. భారత్‌ ఇటీవల అగ్ని–5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన  నేపథ్యంలోనే పాక్‌కు చైనా ఈ ఆయుధా న్ని అమ్మిందని భావిస్తున్నట్లు పేర్కొంది. సాధారణంగా క్షిపణి నిఘా వ్యవస్థలకు రెండు టెలిస్కోపులు ఉంటాయని.. కానీ, పాక్‌ కొనుగోలు చేసిన వ్యవస్థకు నాలుగు టెలిస్కోపులు ఉన్నాయంది. దీంతో ఏకకాలంలో వేర్వేరు దిక్కుల నుంచి వస్తున్న క్షిపణులను గుర్తించడం సులభమవుతుందని పేర్కొంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు