500 ఏళ్లనాటి గురుద్వారాను తెరిచిన పాకిస్థాన్‌

1 Jul, 2019 21:38 IST|Sakshi

లాహోర్‌: పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లోగల 500 ఏళ్ల నాటి గురుద్వారా దర్శనానికి సోమవారం నుంచి భారతీయ సిక్కులను అనుమతిస్తున్నట్లు స్థానిక మీడియా ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ వెల్లడించింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని బాబే–దే–బెర్‌ గురుద్వారాలోకి ఇంతకు ముందు భారతీయులకు అనుమతి లేదు. భారత్‌తోపాటు పలు దేశాల్లో నివసిస్తున్న సిక్కులు పంజాబ్‌లోని వివిధ క్షేత్రాలను దర్శించుకునేందుకు వస్తుంటారు. పాకిస్థాన్, యూరప్, కెనడా, అమెరికాలకు చెందిన యాత్రికులకు గురుద్వారాను సందర్శించేందుకు ఇప్పటికే అనుమతి ఉంది. ఇకపై భారతీయ సిక్కులకు కూడా సియాల్‌కోట్‌ గురుద్వారాలోకి ప్రవేశం కల్పించాలంటూ.. పంజాబ్‌ గవర్నర్‌ ముహమ్మద్‌ సర్వార్‌ ప్రావిన్స్‌ అఖాఫ్‌ శాఖను ఆదేశించినట్టు ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు