అడ్డంగా దొరికిపోయిన పాక్‌.. భారత రాయబారికి నోటీసులు!

1 Jun, 2020 10:52 IST|Sakshi

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఢిల్లీ పోలీసులకు తమ ఐఎస్‌ఐ ఏజెంట్లు అడ్డంగా దొరికిపోయిన తరుణంలో భారత రాయబారికి నోటీసులు జారీ చేసింది. భారత్‌లో పనిచేస్తున్న తమ అధికారులను బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. కాగా పాకిస్తాన్‌ హై కమిషన్‌లో వీసా అధికారులుగా పనిచేస్తున్న తాహిర్‌ ఖాన్‌, అబిద్‌ హుస్సేన్‌ భారత ఆర్మీ రహస్యాలు సేకరించడమే లక్ష్యంగా భారత్‌లో ప్రవేశించారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

నకిలీ ఆధార్‌ కార్డులు ఉపయోగిస్తూ.. ఓ భారత పౌరుడి నుంచి భారత రక్షణ దళానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తూ వీరిరువురు ఆదివారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. వారి నుంచి ఐఫోన్‌, రూ. 15,000 సహా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా అబిద్‌ హుసేన్‌(42) పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో గల షేఖ్‌పురకు చెందిన వాడు కాగా.. మహ్మద్‌ తాహిర్‌(44) ఇస్లామబాద్‌ వాసిగా తేలినట్లు సమాచారం. (‌అయోధ్య‌పై విషం క‌క్కిన పాకిస్తాన్‌)

ఈ క్రమంలో మరింత లోతుగా విచారణ జరుపగా... తాము ఐఎస్‌ఐ గూఢాచారులమని.. అందుకే ఈ వివరాలు సేకరిస్తున్నట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిద్దరిని బహిష్కరించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయంపై సోమవారం స్పందించిన పాకిస్తాన్‌ విదేశాంగ కార్యాలయం.. భారత్‌ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. నిరాధార ఆరోపణలతో తమ అధికారులపై అభియోగాలు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. భారత్‌ చర్యను నిరసిస్తూ భారత రాయబారికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు