ఆకట్టుకుంటున్న చిన్నారి పెళ్ళికూతురు!

16 Feb, 2016 19:52 IST|Sakshi
ఆకట్టుకుంటున్న చిన్నారి పెళ్ళికూతురు!

మేలి ముసుగు వేసుకొని తెల్లని బ్రైడల్ ఫ్రాక్‌తో మెరిసిపోతున్న 12 ఏళ్ల వధువు... సూటూ బూటూ వేసుకొని.. చూసేందుకు ఆమెకు తాతలా కనిపిస్తున్న వరుడు.. సముద్ర తీరంలో జరిగిన ఆ వివాహ వీడియో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. చిన్నారి పెళ్లి కూతురికి... అంత పెద్ద వరుడితో పెళ్లి చేయడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పెళ్లి వీడియో చాలా మందికి ఆగ్రహం కూడా తెప్పించింది. కానీ  వాళ్లిద్దరూ యాక్టర్లు అన్న సంగతి తెలిసిన తర్వాత అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

విడుదలైన క్షణాల్లోనే ఆ పెళ్లి వీడియో సుమారు 20 లక్షల మందిని ఆకట్టుకుంది. అందులో కనిపించే దృశ్యం కథే అయినా.. లెబనాన్, సిరియాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో బలవంతపు పెళ్లిళ్లకు బలవుతున్న వేలమంది చిన్నారుల జీవితాల వాస్తవిక గాధ అది. ఈ వీడియోనే కాదు... అందులోని విషయం కూడా షాక్‌కు గురి చేసేదేనని వీడియో ప్రచారకర్త మాయా అమ్మర్ అంటున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి 18 ఏళ్ల వయసు రాకముందే బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారని ఆమె చెబుతున్నారు.

ఎనిమిదేళ్ల వయసులోపు బాలికలు సుమారు కోటిన్నర మందికి 60-70 ఏళ్ల వయసువారితో  బలవంతంగా పెళ్లిళ్లు చేయిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. యుఎన్ఎఫ్ పిఏ లెక్కల ప్రకారం 2050 నాటికి ఆ లెక్కలు 120 కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాల్య వివాహాలను నిషేధించడంలో భాగంగా తాజాగా లెబనాన్ ప్రభుత్వం సివిల్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ప్రతి వివాహం రిజిస్టర్ కావడంతో బాల్య వివాహాలు అరికట్టే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ప్రస్తుతం 14 సంవత్సరాలు వచ్చేవరకూ బాలికలకు వివాహానికి అనుమతి లేకపోయినా.. తల్లిదండ్రులు తొమ్మిదేళ్ళు వచ్చేసరికల్లా బలవంతంగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలోని అనేక దేశాలను పరిశీలిస్తే చట్ట ప్రకారం బాలికల పెళ్ళి వయసు కనీసం 12 ఏళ్ళుగా తెలుస్తోంది.  ట్రినిడాడ్, తొబాగోల్లో 12 ఏళ్ళు, సిరియాలో 13 ఉంది. కాగా కనీసం 14 ఉండాలని కెనాన్ చట్టం చెప్తోంది. కాంగోలో 15, వెనెజులాలో 18 ఉండగా అక్కడి తల్లిదండ్రులు మాత్రం 14 లోపు వయసువారికే బలవంతపు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అలాగే బొలీవియాలో చట్టప్రకారం బాలికల పెళ్ళి వయసు 21 ఉండగా... కుటుంబీకులు 14 నుంచి 16 ఏళ్ళ వయసులోపు బాలికలను వివాహానికి అనుమతిస్తున్నారు. దీంతో మైనర్లే గర్భవతులుగా కూడ మారుతున్నారు. అలాగే ఇరాన్ లో అబ్బాయిలకు 15, అమ్మాయిలకు 13 ఏళ్ళ వయసును చట్టప్రకారం నిర్ణయించినా.. అంతకన్నా ముందే కుటుంబీకులు వివాహాలకు అనుమతిస్తున్నారు. ఇరాక్, సిరియా, యెమన్లలోనూ సుమారు 18 సంవత్సరాల వయసులో పెళ్ళి చేయాలని చట్టం చెప్తుంటే 13 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ  లోపు బాలికలకే బలవంతపు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు.

అఫ్ఘానిస్థాన్‌లో మాత్రం అబ్బాయికి 18, అమ్మాయికి 16 ఏళ్ళు ఉండాలని చట్టం చెప్తోంది. అయితే అంతకన్నా ముందు బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తే శిక్షార్హులవుతారని కూడా చట్టం హెచ్చరిస్తోంది. లిబియాలో చట్టబద్ధమైన వయసు మహిళలు, పురుషులకు 20 సంవత్పరాలుగానే ఉన్నా... అంతకు ముందు చేసుకోవాలనుకున్నవారిని కోర్టులు అనుమతిస్తున్నాయి. జోర్దాన్ లో ఎటువంటి అనుమతి అవసరం లేకుండా పెళ్ళికి  ఇద్దరికీ 18 సంవత్సరాలు ఉండాలని చట్టం ఉండగా... షరియాలో అబ్బాయిలు మినహా.. స్పెషల్ పర్మిషన్ తీసుకుంటే 15 ఏళ్ళ బాలికలకు వివాహం చేసేందుకు కోర్టులు అనుమతిస్తున్నాయి.