ఐరాస చీఫ్‌గా ఆంటోనియో!

31 Aug, 2016 02:13 IST|Sakshi
ఐరాస చీఫ్‌గా ఆంటోనియో!

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గట్టర్స్ స్పష్టమైన ఆధిక్యత సాధించారు. సోమవారం ముగిసిన 15 దేశాల భద్రతా మండలి మూడో దశ ఎన్నికల్లో ఆంటోనియోకు అనుకూలంగా 11 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు రాగా, ఒక అభిప్రాయం నమోదు కాలేదు. అనధికారికంగా జరిగిన గత రెండు దశల్లోనూ ఆయనే ఆధిక్యంలో కొనసాగారు.ఈ దశలో ఆయన గెలుపు లాంఛనమే కానుంది. గట్టర్స్ పేరును అధికారికంగా అసెంబ్లీకి పంపగానే ఆయన సభ్యత్వాన్ని ఖరారు చేయనున్నారు.

గట్టర్స్ గతంలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగానికి 10 సంవత్సరాలపాటు హై కమిషనర్‌గా పనిచేశారు. కాగా, ఈ పదవికి పోటీ పడిన స్లొవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ 9 అనుకూల ఓట్లు, 5 వ్యతిరేక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. సెర్బియన్ విదేశాంగ మంత్రి వుక్ జెరిమిక్, యునెస్కో డెరైక్టర్ జనరల్ ఇరినా బొకోవా మూడో స్థానంలో నిలిచారు. 70 సంవత్సరాలుగా యూఎన్ సెక్రటరీ జనరల్‌గా పురుషుడే ఎన్నికవుతూ వస్తున్నారు. దీంతో సెక్రటరీ జనరల్ పదవి కోసం ఒక మహిళను ఎన్నుకోవాలని సూచనలు వచ్చాయి.  అయితే ఈ సారికూడా పాత పద్ధతే కొనసాగబోతోంది.

మరిన్ని వార్తలు