ప్రియాంకతో కాంగ్రెస్‌ నిధుల సమస్య తీరొచ్చు!

13 Feb, 2019 03:34 IST|Sakshi

రాజకీయ విశ్లేషకుడు మిలన్‌ వైష్ణవ్‌

వాషింగ్టన్‌: ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనేది ఇప్పటి వరకు స్పష్టం కానప్పటికీ.. ఆమె రంగప్రవేశంతో ఆ పార్టీ వనరులు, నిధుల లేమి నుంచి బయటపడే అవకాశముందని నిపుణులు అంటున్నారు. నిధుల విషయంలో అధికార బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌ చాలా వెనుకబడి ఉందని వారు చెబుతున్నారు. ‘కాంగ్రెస్‌లో కొత్తగా ప్రచార బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. కానీ, ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన నిధుల కొరత తీర్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి’ అని కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు మిలన్‌ వైష్ణవ్‌ అంటున్నారు. ప్రఖ్యాత ‘ఫారిన్‌ పాలసీ’ మేగజైన్‌కు రాసిన తాజా వ్యాసంలో ఆయన ఈ విషయం పేర్కొన్నారు.

‘కాస్ట్స్‌ ఆఫ్‌ డెమోక్రసీ: పొలిటికల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ ఇండియా’ పుస్తకం సహ రచయిత కూడా అయిన వైష్ణవ్‌.. ‘ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ నుంచి నిధులు అందకపోవడంతో రాష్ట్ర విభాగాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. 2014 ఎన్నికల తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో చాలా తక్కువ విజయాలు సాధించిన ఆ పార్టీ తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఉంది. దేశ రాజకీయాలకు కీలక బిందువైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పట్టించుకోకుండా ముఖ్యమైన ఎస్‌పీ–బీఎస్‌పీ పార్టీల కూటమి ఏర్పడటం మరో దెబ్బ. ఎంతో కీలకమైన ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 41 లోక్‌సభ సీట్లున్న తూర్పు ఉత్తరప్రదేశ్‌ ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. మిగతా పక్షాలతో కలిసి ఎన్నికల్లో బీజేపీపై పైచేయి సాధించటానికి ఆ పార్టీకి అవకాశం వచ్చింది. అయితే, శ్రేణుల్లో ఉత్తేజం నింపడం, మిత్రుల్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు ఎన్నికల్లో గెలుపునకు డబ్బు ఎంతో కీలకం. ఆ పార్టీకి నిధుల కొరత ఉంది. ప్రియాంక రాకతో అది తీరే అవకాశం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు