బహ్రెయిన్‌ క్రౌన్‌ ప్రిన్స్‌తో రాహుల్‌ భేటీ

9 Jan, 2018 02:03 IST|Sakshi

మనామ: కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విదేశాల్లో పర్యటిస్తోన్న రాహుల్‌ గాంధీ సోమవారం బహ్రైన్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ సల్మాన్‌ బిన్‌ హమద్‌ అల్‌ ఖలీఫాతో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరూ చర్చించారు. ప్రభుత్వ అతిథిగా ఆ దేశంలో పర్యటిస్తోన్న రాహుల్‌.. రాజు హమాస్‌ బిన్‌ అల్‌ ఖలీఫాను కూడా కలవనున్నారు. క్రౌన్‌ ప్రిన్స్‌తో భేటీ అనంతరం రాహుల్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘భారత్, బహ్రైన్‌లకు సంబంధించి పరస్పర ఆసక్తులపై ఇద్దరం చర్చించాం’ అని పేర్కొన్నారు. ’గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌’ (గోపియో) నిర్వహించిన ప్రవాసీ సమ్మేళన్‌లోనూ పాల్గొన్నారు.

గల్ఫ్‌లో 10 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలంగాణ పీసీసీ గల్ఫ్‌ ఎన్నారై విభాగం అధ్యక్షుడు నంగి దేవేందర్‌ రెడ్డి రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ గల్ఫ్‌ వలసలపై నివేదికను అందజేశారు. ఎన్‌ఆర్‌ఐలతో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘నేను కూడా తప్పులు చేశా.. అయితే నేనూ మానవ మాత్రుడినే. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో అనుభవం, యువతరం మధ్య మంచి సమన్వయం ఉంది. కొత్త కాంగ్రెస్‌ పార్టీని మీకు అందిస్తాం’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు