పుతిన్‌ కీలక నిర్ణయం.. రష్యా ప్రధాని రాజీనామా

15 Jan, 2020 20:49 IST|Sakshi

మాస్కో: రష్యా ప్రధాన మంత్రి దిమిత్రి మెద్వెదేవ్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. దిమిత్రితో సహా రష్యా ప్రభుత్వ మంత్రిమండలి మొత్తం పదవుల నుంచి వైదొలగినట్లు పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బుధవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన క్రమంలో దిమిత్రి రాజీనామా ప్రకటన చేయడం గమనార్హం. పుతిన్‌ మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని.. ఈ మేరకు ప్రధాని, మంత్రుల అధికారాలను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈ నేపథ్యంలో ప్రధాని దిమిత్రి తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఈ మేరకు దిమిత్రి మాట్లాడుతూ... ‘దేశ భవిష్యత్తుకై అధ్యక్షుడు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇకపై తదుపరి నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... దిమిత్రి మెద్వెదేవ్‌ ప్రధానిగా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారని పుతిన్‌ కొనియాడారు. అయితే ఆయన కేబినెట్‌ మాత్రం లక్ష్యాలు చేరుకోవడంలో విఫలమైందని పేర్కొన్నారు. కాగా పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన దిమిత్రి 2012 నుంచి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక ఆయనను జాతీయ భద్రతా మండలి డిప్యూటీగా పుతిన్‌ నియమించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు