ఈ వంటనూనె 80 సార్లు వాడొచ్చట!

10 Aug, 2015 10:10 IST|Sakshi
ఈ వంటనూనె 80 సార్లు వాడొచ్చట!

కౌలాలంపూర్: మనం వినియోగించే ఏ వంట నూనెనైనా ఎన్ని సార్లు వాడతాం? ఒకటి.. లేదా రెండుసార్లు. అంతకుమించే వాడితే అది అనారోగ్యానికి దారి తీస్తుంది. అయితే ఇప్పుడు ఒకటీ, రెండు సార్లు కాదు... ఏకంగా 80 సార్లు వినియోగించగలిగే వంటనూనెను తయారు చేశారు పరిశోధకులు. పైగా ఈ నూనె హృద్రోగాలు, క్యాన్సర్ వంటి సమస్యల్ని కూడా తగ్గించగలదట. మలేసియాలోని యూనివర్సిటీ ఆఫ్ పుత్రకు చెందిన పరిశోధకుల బృందం పామాయిల్, ఇతర ప్రకృతి సిద్ధ మూలికలనుంచి దీన్ని తయారు చేసింది.

ఈ నూనెను 'ఏఎఫ్‌డీహెచ్‌ఏఎల్'గా పిలుస్తున్నారు. పామాయిల్, రూటేసీ జాతి మొక్కల నుంచి తయారైన ఈ నూనె ఇతర నూనెల కన్నా ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని పరిశోధకులు అన్నారు. వేపుళ్లు వంటివి చేసినప్పుడు ఆయా పదార్థాలు ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. కానీ ఈ నూనెతో చేసే పదార్థాలకు 85 శాతం తక్కువ నూనె వినియోగమవుతుందట. గుండె జబ్బుల ముప్పును కూడా ఇది తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ నూనె తయారీకి వాడిన రూటేసీ మూలిక సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయడంతోపాటు, నూనె పాడవకుండా కాపాడుతుంది. ఇది నూనెను ఎక్కువగా పాడైపోకుండా కాపాడడంతో ఇది 80 సార్లు వినియోగించేందుకు వీలవుతుంది. ఇన్నిసార్లు వినియోగించినా ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదని సుహైలా అనే శాస్త్రవేత్త అన్నారు. ఇది యాంటీ ఆక్సిడెంట్, బ్యాక్టీరియా నిరోధకం, ఎలర్జీ నిరోధకంగా పనిచేస్తుంది.

మరిన్ని వార్తలు