విల్లా ఉన్నా.. భిక్షాటన!

4 Nov, 2018 02:35 IST|Sakshi

‘ఆమెకెవ్వరూ సాయం చేయకండి! ఆమె చెప్పే కథలకు కరిగిపోకండి! మీకు కనిపిస్తున్నంత అమాయకురాలు కాదు. ఆమె  ధనవంతురాలు, ఐదంతస్తుల విల్లాలో నివసిస్తుంది! దయచేసి ఆమెకు సాయం చేయకండి’అంటూ చైనాలోని హాంగ్‌జూ రైల్వేస్టేషన్‌లో  గుడిలో స్తోత్రంలా వినిపిస్తుంటుంది. ఇదంతా 79 ఏళ్ల ఓ యాచకురాలు గురించి. ఆమెకు ప్రభుత్వం నుంచి పెన్షన్‌ కూడా వస్తుంది. కొడుకు వ్యాపారాలు చూసుకుంటాడు. కొడుకు ఎన్నోసార్లు చెప్పి చూసినా ఆమె యాచక వృత్తిని మానలేదట! ఇలా కాదని ఆమె ఫొటోలు గోడలు, సోషల్‌ మీడియాలో పెట్టి ‘దయచేసి ఈమెకు దానం చెయ్యొద్దు’అని ఆమె కథను విస్తృతంగా ప్రచారం చేసినా లాభం లేకపోయింది. దీంతో రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. మైకుల్లో అరవడం మొదలుపెట్టారు. అయినా ఫలితం లేదు.

ఆమె వయసు,అవతారం చూసి జనాలు జాలితో దానం చేసి వెళ్తున్నారట! ఆమె తొలుత రైల్వే స్టేషన్‌లో మ్యాప్‌లు అమ్మడానికి ప్రయత్నించింది. కానీ, రైల్వే అధికారులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో అదే రైల్వే స్టేషన్‌లో యాచించడం మొదలెట్టింది. రోజుకు 300 యువాన్లు కూడబెడుతుందట! ఇంటి వద్ద ఊరికే కూర్చోవడం ఇష్టం ఉండదని వయసు పెరిగేకొద్దీ డబ్బు అవసరం పెరుగుతుండటంతో యాచిస్తున్నానని పేర్కొంది.  ఆమెపై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇది ప్రజల సొమ్ము దోచుకోవడమేనని ఓ వర్గం తిట్టిపోస్తుంటే.. కొడుకు సరిగ్గా చూసుకో కపోవడం వల్లే ఒంటరితనం ఆమెనలా చేసిందని.. అందులో ఆమె తప్పేం లేదని మరో వర్గం దన్నుగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు