రోబో తప్పించుకుని రోడ్డుపైకి వచ్చింది..

19 Jun, 2016 03:30 IST|Sakshi
రోబో తప్పించుకుని రోడ్డుపైకి వచ్చింది..

ఓ రోబో హఠాత్తుగా రద్దీగా ఉండే రోడ్డుపై ప్రత్యక్షమైంది. నడిరోడ్డుపై అది ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్కడ రోబోను చూస్తున్న వారికి కాసేపు ఏమీ అర్థంకాలేదు. ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం తీసిన షాట్లా ఉన్నా.. నిజంగా జరిగిన ఘటన ఇది.

రష్యాలోని పెర్మ్ నగరంలో సైంటిస్టుల నుంచి తప్పించుకున్న ఓ రోబో రోడ్డుపైకి వచ్చింది. దీని పేరు ప్రొమోబో. ఇంజనీర్ గేటు వేయడం మరచిపోవడంతో రోబో ప్రయోగశాల నుంచి బయటకు వచ్చింది. నడి రోడ్డుపైకి వచ్చేసరికి బ్యాటరీ అయిపోవడంతో అది ఆగిపోయింది. దీంతో దాదాపు గంట సేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఓ పోలీసు రోబో దగ్గరకు వచ్చి నిలబడి వాహనాలు దాన్ని ఢీకొట్టకుండా మళ్లించాడు. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి రోబోను అక్కడ నుంచి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి యూ ట్యూబ్లో పోస్ట్ చేశాడు.

ప్రొమోబోను తయారు చేసిన కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఒలెగ్ కివోకుర్ట్సెవ్ మాట్లాడుతూ.. ఈ రోబో ప్రయోగశాలలో తనంతటతానే కదిలే విధానాన్ని నేర్చుకుంటున్నట్టు చెప్పారు. ఈ రోబోలు ప్రజలను గుర్తుపట్టడంతో పాటు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, తగిన సూచనలు ఇస్తాయని తెలిపారు.

మరిన్ని వార్తలు