ఎవరీ పనిలేని దేవుడు?

27 Jun, 2018 15:22 IST|Sakshi
ఫిలీప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై:  ఎవరీ పనిలేని దేవుడు? అంటూ వ్యాఖ్యలు చేసి ఫిలీప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్‌ వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం ఒక కార్యక్రమంలో ఆయన బైబిల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బైబిల్‌ రచనపై మాట్లాడుతూ.. దేవుడు ఈవ్‌, ఆడంను ఎందుకు సృష్టించాలి. వారు సన్మార్గంలో నడవక మనందరికీ ఎందుకు జన్మనివ్వాలి? వారి పిల్లలమైన మనం ఇలా ఎందుకుండాలి? అని అన్నారు. మనం సృష్టించిన ప్రతి వస్తువు ఏదో ఒక సందర్భంలో దాని స్వభావానికి భిన్నంగా పని చేయొచ్చు కదా వ్యాఖ్యానించారు. ఫిలిప్పీన్స్‌లో నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ మాఫియాను అరికట్టే క్రమంలో దేశాధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్‌ ఎందరో చావులకు కారణమయ్యాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

అమాయకులను పొట్టనబెట్టుకున్నారంటూ  క్యాథలిక్‌ క్రైస్తవ మత పెద్దలు కూడా ఆయనపై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై  ఆరోపణలు చేసిన మత పెద్దలను విమర్శించే క్రమంలో..  డ్యూటర్ట్‌ క్రైస్తవ మత విశ్వాసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. క్యాథలిక్‌ క్రైస్తవంపై, బైబిల్‌పై, దేవుడిపై ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేసే వ్యక్తి దేశానికి అధ్యక్షుడుగా ఉండరాదంటూ బిషప్‌ పోబ్లో విర్జిలో డేవిడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా డ్యూటర్ట్‌ పనిరాడంటూ ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేశారు. దేశంలో దాదాపు 80 శాతం ఉన్న క్యాథలిక్‌ క్రైస్తవుల మత విశ్వాసాల పట్ల అధ్యక్షుడి తీరు సరిగా లేదని సోషల్‌ మీడియాలో ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు.

మరిన్ని వార్తలు