'ఖైదీ'రచనల ప్రకంపనలు..

25 Jan, 2016 18:34 IST|Sakshi
'ఖైదీ'రచనల ప్రకంపనలు..

రియల్ ఎస్టేట్ టు రాకెట్ సైన్స్.. సాక్సుల వాడకం నుంచి సాకర్ బెట్టింగ్స్ వరకు.. ఒక్కటేమిటి దేశంలో జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న అనేక విషయాలపై ప్రచురితమైన పుస్తకాలు రొమేనియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అలాగని వాటిని రాసింది ఏ శాస్త్రవేత్తలో అనుకుంటే పొరపాటే.. పచ్చి మోసగాళ్లు, అవినీతిలో ఆరితేరి దోషులుగా తేలిన  ప్రబుద్ధులు.. ప్రస్తుతం జైలులో ఉంటూ రాసిన పుస్తకాలవి. రచనల ద్వారా శిక్షా కాలాన్ని తగ్గించుకునే వెసులుబాటును తమకు అనుకూలంగా మార్చుకున్న ఆ అక్షర ఖైదీల అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు ఆ దేశ  న్యాయ శాఖ సోమవారం ప్రకటించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే..

ప్రస్తుతం యురోపియన్ యూనియన్ లో ఒకటైన రొమేనియా గతంలో యూఎస్ఎస్ఆర్ లో అంతర్భాగంగా ఉండేది. నాటి కమ్యూనిస్టు పాలనలో రాజకీయ ఖైదీలకు జైలులో కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉండేవి. ఖైదీలు తమ అభిరుచి మేరకు ఎంచుకున్న అంశంపై పుస్తకాలు రాసే వీలుండేది. అలా వారు రాసే ఒక్కో పుస్తకానికిగానూ 30 రోజుల శిక్షా కాలాన్ని తగ్గించేది ప్రభుత్వం. కాల క్రమంలో ఆ ప్రత్యేక సదుపాయాలు పొందేవారిలో బడా బాబులూ చేరిపోయారు. శ్రీమంతులుగా పుట్టి చిన్నచిన్న పనులు కూడా చేయడం చేతకానివాళ్లు కూడా పుస్తకాలు రాసి శిక్షా కాలాన్ని తగ్గించుకోవచ్చన్నమాట.

అయితే గడిచిన కొద్ది రోజులుగా ఖైదీలు రాస్తోన్న పుస్తకాల సంఖ్య వందల్లోకి చేరుకుంది. 2014లో ఖైదీలు రాసిన పుస్తకాల సంఖ్య 90కాగా, 2015లో అది 340కి పెరిగింది. ఇటీవలే ఒక ఖైదీ కేవలం ఏడు గంటల్లోనే 2012 పేజీల పుస్తకాన్ని రాసేయటం, మరో ఖైదీ 12 గంటల్లో 189 పేజీల పుస్తకాన్ని మిడికేయటం వివాదాస్పదంగా మారింది. ఖైదీలు రాసే పుస్తకాలు.. యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు పరిశీలించిన అంతరం జడ్జి అనుమతితో ప్రచురణకు వెళతాయి.

 

కాగా, జైళ్లలో ఉంటూనే బయట తమ ప్రభావాన్ని చాటుకునే ఖైదీలతో ప్రొఫెసర్లు కుమ్మక్కయ్యారనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. నిజానికి ఆ పుస్తకాలేవీ పాఠకాదరణ పొందలేకపోయాయి. రాతలో విషయం లేకున్నా పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రాస్తూ అక్రమ మార్గంలో శిక్షా కాలాన్ని తగ్గించుకోజూసిన ఖైదీల వ్యవహారంపై ప్రారంభమైన దర్యాప్తులు ఇంకెన్ని నిజాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాలిమరి.

>
మరిన్ని వార్తలు