పెంట్‌ హౌస్‌ రూ.1,133కోట్లు!

7 Dec, 2023 05:24 IST|Sakshi

దాని విస్తీర్ణం 22 వేల చదరపు అడుగులు

దుబాయ్‌లో దుమ్ము రేపే రికార్డు

వామ్మో అనుకుంటున్నారా? కానీ ఇది నిజంగా నిజం. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన పామ్‌ జుమెరియా ప్రాంతంలో కడుతున్న కోమో రెసిడెన్సెస్‌ అనే 71 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఈ పెంట్‌ హౌస్‌ రానుంది. ఓ అజ్ఞాత కుబేరుడు దీన్ని ఏకంగా రూ.1,133 కోట్లకు కొనుక్కున్నాడు! ఈ ఐదు పడకగదుల పెంట్‌ హౌస్‌ విస్తీర్ణం 22 వేల చదరపు అడుగులు. ప్రపంచ రియల్టీ మార్కెట్లో అత్యంత ఎక్కువ ధర పలికిన మూడో పెంట్‌ హౌస్‌గా ఇది కొత్త రికార్డు సృష్టించింది.

దుబాయ్‌ వరకూ అయితే దీనిదే రికార్డు. 2027లో కోమో టవర్‌ నిర్మాణం పూర్తయ్యాక ఇది కొనుగోలుదారుకు అందుబాటులోకి రానుంది! అతని వివరాలను రహస్యంగా ఉంచినట్లు నిర్మాణ భాగస్వామి ప్రావిడెంట్‌ ఎస్టేట్‌ పేర్కొంది. అయితే ‘‘ఆ కుబేరుడు తూర్పు యూరప్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి’’ అని ప్రావిడెంట్‌ ఎస్టేట్‌కు అసోసియేట్‌ పార్ట్‌నర్‌ అయిన శామ్‌ హొరానీ వెల్లడించారు. రియల్టీ స్వర్గధామమైన దుబాయ్‌లో అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు, పెంట్‌ హౌస్‌ల ధరలు చుక్కలనంటడం ఇది తొలిసారేమీ కాదు. కొద్ది నెలల క్రితం మర్సా అల్‌ అరబ్‌ హోటల్‌ పెంట్‌ హౌస్‌ ఏకంగా రూ.956 కోట్లకు అమ్ముడైంది.

ప్రత్యేకతలెన్నో...
ఎన్నెన్నో ప్రత్యేకతలు కోమో రెసిడెన్స్‌ పెంట్‌ హౌస్‌ సొంతం
► ఇందులో 360 డిగ్రీల స్కై పూల్‌ ఉంటుంది.
►ఇది వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకమైన చోట రానుంది.
►దీనిపై నుంచి ఇటు చూస్తే ప్రపంచంలోకెల్లా ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా, అటు చూస్తే దానికి సాటి వచ్చే బుర్గ్‌ అల్‌ అరబ్, దుబాయ్‌ మరీనా వంటి ఆకాశాన్నంటే నిర్మాణాలెన్నో కను విందు చేస్తాయి.
►కోమో రెసిడెన్సెస్‌ టవర్‌ ఎత్తు 300 మీటర్ల (984 అడుగుల) పై చిలుకే.
►ఇంతా చేసి, ఈ అపార్ట్‌మెంట్‌లో ఒక్కో ఫ్లోర్‌లో కేవలం ఒకట్రెండు ఫ్లాట్లు మాత్రమే
ఉంటాయి.
►రెండు నుంచి ఏడు పడకగదులతో కూడుకుని ఉండే ఈ ఫ్లాట్లకు ప్రైవేట్‌ లిఫ్టులు, ప్రైవేట్‌ శాండీ బీచ్‌లు, 25 మీటర్ల లాప్‌ పూల్స్, రూఫ్‌ టాప్‌ ఇన్ఫినిటీ పూల్‌ వంటి చాలా
 ప్రత్యేకతలుంటాయి.
►ఈ ఫ్లాట్ల ధర రూ.47.5 కోట్ల నుంచి మొదలవుతుంది.

ప్రపంచ రికార్డు రూ.3,670 కోట్లు
మొనాకోలోని ఓడియన్‌ టవర్‌ పెంట్‌ హౌస్‌ రూ.3,670 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంట్‌ హౌస్‌గా రికార్డు సృష్టించింది. లండన్‌లోని వన్‌ హైడ్‌ పార్క్‌ పెంట్‌ హౌస్‌ రూ.1,975 కోట్లతో రెండో స్థానంలో ఉంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

>
మరిన్ని వార్తలు