Israel-Hamas War Updates: గాజాలో భయం భయం

7 Dec, 2023 06:07 IST|Sakshi
ఉత్తరగాజాలోని రఫా పట్టణంలో సహాయక శిబిరం వద్ద ఆహారం తీసుకుంటున్న చిన్నారులు

భూతల దాడులు ఉధృతం చేసిన ఇజ్రాయెల్‌ సైన్యం 

ఆహారం, నీరు, ఔషధాలు అందక జనం విలవిల   

ఖాన్‌ యూనిస్‌: గాజా్రస్టిప్‌లో పరిస్థితులు మరింత క్షీణిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ సైన్యం భూతల దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల ఆచూకీ కోసం ఇజ్రాయెల్‌ సైనికులు ప్రతి ఇంటినీ సోదా చేస్తున్నారు. మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్, ఉత్తర గాజాలోని జబాలియా, షుజాయియా నగరాలను ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులు చుట్టుముడుతున్నాయి. ఈ మూడు నగరాల్లో వేలాది మంది పాలస్తీనా పౌరులు చిక్కుకుపోయారు.

దక్షిణ గాజాలో 6 లక్షల మందికి పైగా ఉన్నారని, వారంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరించిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గాజాలోని శరణార్థి శిబిరాలన్నీ ఇప్పటికే బాధితులతో నిండిపోయాయని, ఇక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎవరికీ దిక్కుతోచడం లేదని పేర్కొంది. ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఖాన్‌ యూనిస్‌ సిటీపై ఇజ్రాయెల్‌ సైన్యం బుధవారం బాంబుల వర్షం కురిపించింది. హమాస్‌ ముఖ్యనేతలంతా ఖాన్‌ యూనిస్‌లో మాటు వేశారని, వారిని బంధించక తప్పదని ఇజ్రాయెల్‌ సైన్యం చెబుతోంది.

>
మరిన్ని వార్తలు