11 మంది మృతి.. 9 మంది గల్లంతు

22 Jan, 2019 13:36 IST|Sakshi

మాస్కో : భారత్‌, టర్కిష్‌, లిబయాన్‌ సిబ్బందితో వెళ్తున్న రెండు నౌకలు నడి సంద్రంలో అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది మరణించిగా.. 9 మంది గల్లైంతనట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. రష్యా నుంచి  క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్‌ జలసంధి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. సోమవారం ప్రమాదానికి గురైన రెండు షిప్పుల్లో ఒకటి సహజవాయువును మోసుకువెళ్తుండగా.. మరొకటి ట్యాంకర్‌ నౌక అని స్థానిక మీడియా తెలిపింది. ఒక నౌక నుంచి మరొక నౌకలోకి ఇంధనం మార్చుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.

ప్రమాదానికి గురైన క్యాండీ అనే షిప్పులో 17 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 9మంది టర్కీ పౌరులు కాగా, ఎనిమిది మంది భారతీయులు. మరో నౌక మేస్ట్రోలో 15 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 7గురు టర్కీ పౌరులు, ఏడుగురు భారతీయులు కాగా మరోకరు లిబియాకు చెందిన వారని రష్యా అధికారులు తెలిపారు. ఒక నౌకలో పేలుడు సంభవించటంతో చెలరేగిన మంటలు మరో షిప్పుకు అంటుకున్నాయని పేర్కొన్నారు. మంటలు వ్యాపించగానే రెండు నౌకల్లోని మొత్తం 32 మంది సిబ్బంది సముద్రంలోకి దూకారని, వారిలో ఇప్పటి వరకూ 12 మందిని సహాయక సిబ్బంది రక్షించి తీరానికి చేర్చారని వెల్లడించారు.

కాగా ఈ ప్రమాదంలో 11మంది చనిపోయారని, మరో 9 మంది ఆచూకీ తెలియరాలేదని తెలిపారు. అయితే మృతుల్లో భారతీయులు ఉన్నారా లేరా అనే విషయం ఇంకా తెలియలేదు.  ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తీవ్ర ఆటంకం ఏర్పడుతోందన్నారు అధికారులు.

మరిన్ని వార్తలు