ఈ హంతకుడు అధ్యక్షుడికి కాపలా కాశాడు

21 Dec, 2016 19:13 IST|Sakshi
ఈ హంతకుడు అధ్యక్షుడికి కాపలా కాశాడు

టర్కీ: అంకారాలోని ఓ వేదికపై రష్యా రాయబారిని అతి కిరాతకంగా కాల్చి చంపిన టర్కీ పోలీసు అధికారి మెవ్‌లత్‌ మెర్ట్‌ అల్తింటాస్‌(22) గతంలో ఎనిమిదిసార్లు టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగన్‌కు అంగరక్షణ బాధ్యతలు కూడా నిర్వహించాడట.ఈ ఏడాది జూలై 15న టర్కీలో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎర్డోగన్‌ కు అతడు మొత్తం ఎనిమిది సందర్భాల్లో రక్షణ బాధ్యతలు నిర్వహించినట్లు ఓ రిపోర్టు బుధవారం తెలిపింది. సోమవారం సాయంత్రం ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ లోని వేదికపై రష్యా రాయబారి ఆండ్రే కర్లోవ్‌ మాట్లాడుతుండగా అల్తింటాస్‌ నేరుగా వెళ్లి ఆయనపై తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.

అయితే, ఈ అల్తింటాస్‌ కు టర్కీలో సైనిక తిరుగుబాటుకు కారణంగా అనుమానిస్తున్న అమెరికాలోని ముస్లిం మతపెద్ద ఫెతుల్లా గులెన్‌కు సంబంధాలు ఉన్నట్లు టర్కీ పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో గులెన్‌ విద్యాసంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు కూడా అల్తింటాస్‌ వెళ్లినట్లు గుర్తించారు. అంతేకాకుండా టర్కీ విదేశాంగ మంత్రి మెవ్‌లట్‌ కావ్‌సోగ్లు అమెరికా విదేశాంగమంత్రి జాన్‌ కెర్రీతో మంగళవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడుతూ ఇదే అనుమానం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు