వయసు ఏడేళ్లు... సంపాదన రూ.150 కోట్లు!

4 Dec, 2018 20:55 IST|Sakshi

వాషింగ్టన్‌ : మిలియనీర్‌గా ఎదగడానికి ఒక వ్యక్తికి కనీసంలో కనీసం ముప్పై ఏళ్లైనా పడుతుంది. కానీ అమెరికాకు చెందిన ర్యాన్‌ అనే ఏడేళ్ల కుర్రాడు మాత్రం కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.150 కోట్లుతో పాటు, సోషల్‌ మీడియాలో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

యూట్యూబ్‌ చానల్‌తో... 
ప్రస్తుతం ఎంతో మంది ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్న యూట్యూబ్‌నే ర్యాన్‌ సైతం తన సంపాదనకు ఉపయోగించుకున్నాడు. 2015లో ఈ చిన్నోడు.. ‘ర్యాన్‌ టాయ్స్‌ రివ్యూ’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించాడు. రోజూ చిన్నారుల బొమ్మల వీడియోలు అప్‌లోడ్‌ చేసేవాడు. కొద్దిరోజుల్లో ఈ వీడియోలకు అభిమానులు పెరిగిపోయారు. ఇప్పుడవే వీడియోలు కోట్ల రూపాయలు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ర్యాన్‌ చానల్‌ను దాదాపు కోటికి పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు. 

ఫోర్బ్స్‌ జాబితాలో తొలి స్థానం.. 
యూట్యూబ్‌ ద్వారా ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న వారి జాబితాలో ర్యాన్‌ తొలి స్థానం సంపాదించుకున్నాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ఈ వివరాలు ప్రకటించింది. ఈ జాబితాలో గతేడాది 8వ స్థానంలో నిలిచిన ర్యాన్‌.. ఈసారి తన సంపాదన రెట్టింపు చేసుకున్నాడు.  

బొమ్మలతో వీడియోలు... 
అందరు చిన్నారుల్లాగే నచ్చిన బొమ్మలతో ఆడుకుంటూనే ర్యాన్‌ కోటీశ్వరుడయ్యాడు. అయితే ర్యాన్‌ ఆ బొమ్మలతో వీడియో కెమెరాల ముందు ఆడుకుంటాడు. కొత్తగా వచ్చే రకరకాల బొమ్మలపై రివ్యూలు ఇస్తుంటాడు. అవి ఎలా పనిచేస్తాయో అందులో వివరిస్తాడు. ఆ వీడియోల్ని తన చానెల్‌లో పోస్ట్‌ చేయగా వాటిని కొన్ని లక్షల మంది చూడటం వల్ల లెక్కలేనన్ని యాడ్స్‌ వచ్చాయి. దీంతో ర్యాన్‌ ఖాతాలోకి ఆదాయం వచ్చి చేరింది.   
 

మరిన్ని వార్తలు