‘గుర్తుపట్టలేనంత దారుణంగా కాలిపోయింది’

12 Mar, 2018 09:03 IST|Sakshi
విమానంలో చివరిసారి మినా తీయించుకున్న ఫొటో, పక్కనే ప్రమాద దృశ్యాలు

ఇస్తాంబుల్‌/షార్జా : ఇరాన్‌ భూభాగంలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టర్కీకి చెందిన ఓ ప్రైవేటు జెట్‌ విమానం.. జగ్రోస్‌ పర్వత శ్రేణుల్లో కుప్పకూలిన ఘటనలో పైలట్‌ సహా 11 మంది యువతులు దుర్మణం చెందారు.

ఇంజన్‌లో మంటలు.. క్షణాల్లోనే ఘోరం : టర్కీకి చెందిన బాంబడైర్‌(టీసీ-టీఆర్‌బీ) జెట్‌ విమానం ఆదివారం షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇస్తాంబుల్‌కు బయలుదేరింది. ఇరాన్‌ గగనతలంపై దాదాపు 35వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు.. ఇంజన్‌లో లోపాలు తలెత్తాయి. పైలట్‌ విమానాన్ని కిందికి దించే ప్రయత్నం చేయగా ఒక్కసారే మంటలురేగాయి. చూస్తుండగానే విమానం.. జగ్రోస్‌ పర్వతశ్రేణిలోని ఓ గ్రామానికి సమీపంలో కొండను ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వెలువడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పరుగున అక్కడికి వెళ్లారు. ‘‘కానీ అప్పటికే శకలాలు చెల్లాచెదురయ్యాయి. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి’ అని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

ఆమె ప్రముఖ సోషలైట్‌ మినా : చనిపోయింది.. టర్కీ కేంద్రంగా పనిచేసే బషరన్‌ బిజినెస్‌ గ్రూప్‌ యజమాని కూతురు మినా బషరన్‌‌(28), ఆమె స్నేహితులేనని అధికారులు తెలిపారు. కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న మీనా.. తన స్నేహితులకు షార్జాలో బ్యాచిలర్‌ పార్టీ ఇచ్చారని, వేడుకలు ముగించుకొని తిరిగి వెళుతున్న క్రమంలో విమానప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. చిన్నవయసులోనే వ్యాపార రంగంలోకి ప్రవేశించిన మినా.. టర్కిష్‌ యూత్‌ ఐకాన్‌గానూ ఉన్నారు. ప్రమాదానికి ముందు ఆమె దిగిన ఫొటోలు టర్కీలో వైరల్‌ అవుతున్నాయి. గత నెలలో.. టెహ్రాన్‌ నుంచి యసుజ్‌ కు బయలుదేరిన విమానమొకటి ఇదే జాగ్రోస్‌ పర్వతాల్లో కూలిపోయిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో 65 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదానికి కొద్ది గంటల ముందు స్నేహితురాళ్లతో మినా(చనిపోయిన 11 మందిలో వీరు కూడా ఉన్నారు)

 

మరిన్ని వార్తలు