బ్లింకెన్ పర్యటన వేళ.. టర్కీలో యూఎస్ ఎయిర్‌బేస్‌పై దాడి

6 Nov, 2023 12:14 IST|Sakshi

అంకారా: టర్కీలో పాలస్తీనా మద్దతుదారులు అమెరికా వైమానిక స్థావరంపై దాడికి ప్రయత్నించారు. వందల సంఖ్యలో నిరసనకారులు ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడ్డారు. బారికేడ్లను దాటడానికి ప్రయత్నిస్తూ పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు, ఖుర్చీలను విసిరారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు ట్యియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించారు. గాజా యుద్ధంపై చర్చలు జరపడానికి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నేడు(సోమవారం) టర్కీలో పర్యటిస్తున్న క్రమంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. 

గాజా యుద్ధంపై ఇజ్రాయెల్‌ను టర్కీ మొదటినుంచీ విమర్శిస్తోంది. హమాస్‌ పేరుతో అమాయకులైన ప్రజలపై దాడులకు పాల్పడుతోందని ఇజ్రాయెల్‌ను నిందిస్తోంది. ఇదే క్రమంలో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య శాంతి నెలకొనడానికి ప్రయత్నాలు చేస్తోంది. యుద్ధం ప్రారంభమైన నాటినుంచి టర్కీలో పాలస్తీనా మద్దతుదారులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలోనే తాజాగా వైమానిక స్థావరంపై దాడి జరిగింది. ఇస్లామిస్ట్ టర్కిష్ సహాయ సంస్థ IHH హ్యుమానిటేరియన్ రిలీఫ్ ఫౌండేషన్ గాజాపై ఇజ్రాయెల్ దాడులను,  ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతును నిరసిస్తూ ఈ దాడికి పిలుపునిచ్చింది. 

ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేస్తున్న క్రమంలో పశ్చిమాసియాలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బ్లింకెన్‌ ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్‌ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. ఇరాక్‌లోనూ పర్యటన చేపట్టారు. బాగ్దాద్‌లో ఇరాక్‌ ప్రధాని మహ్మద్‌ షియా అల్‌ సుదానీతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేడు తుర్కియేలో పర్యటించనున్నారు. 

ఇదీ చదవండి: గాజాను రెండుగా విభజించాం.. ఇజ్రాయెల్ సైన్యం కీలక పకటన

మరిన్ని వార్తలు