చనిపోయిన తల్లిదండ్రులే వారిని కలిపారు!

19 Apr, 2017 10:43 IST|Sakshi
చనిపోయిన తల్లిదండ్రులే వారిని కలిపారు!

బీజింగ్‌: వెయిటింగ్‌ ఫర్‌ మీ అనే టీవీ కార్యక్రమం ద్వారా 27 ఏళ్ల క్రితం విడిపోయిన తోబుట్టువులు చైనాలో మళ్లీ కలిశారు. వారిని కలిపింది ఎవరో కాదు.. చనిపోయిన వారి తల్లిదండ్రులే. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. చనిపోయిన తల్లిదండ్రుల సమాధి నుంచి సేకరించిన డీఎన్‌ఏ ద్వారా అక్కాతమ్ముడు కలిశారు. షో నిర్వాహకులతో పాటు ఆ కార్యక్రమాన్ని వీక్షించిన వారిని కంటతడిపెట్టించిన ఆ వివరాలు ఇవి.

1990వ సంవత్సరంలో యాన్యన్‌ అనే రెండేళ్ల బాలుడు రైల్వే స్టేషన్‌లో తప్పిపోయాడు. తప్పిపోయిన కొడుకు కోసం నాలుగేళ్ల కూతురు జియాయును అమ్మమ్మ వద్ద వదిలేసి.. తల్లిదండ్రులు వెతకని చోటులేదు. ఉద్యోగాన్ని వదిలేసి రెండేళ్ల పాటు యాన్యన్‌ను వెతికుతూ.. తీవ్ర నిరాశలో కూరుకుపోయిన తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ తరువాత తమ్ముడిని వెతికే బాధ్యతను జియాయు తీసుకుంది.

ఈ క్రమంలో 2015లో పబ్లిక్‌ సెక్యురిటీ అఫిసియల్‌ వెబ్‌సైట్‌లో జియాయు తన డీఎన్‌ఏ వివరాలను నమోదుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో తప్పిపోయి అక్రమ రవాణా ద్వారా తూర్పు చైనాకు చేరుకున్న యాన్యన్‌ కూడా సరిగ్గా ఇదే సమయంలో తన డీఎన్‌ఏ వివరాలను ఆ వెబ్‌సైట్‌లో నమోదు చేశాడు. అయితే.. ఈ రెండు డీఎన్‌ఏల మధ్య సారూప్యతలు ఉన్నప్పటికీ.. తల్లిదండ్రుల డీఎన్‌ఏతో సరిపోల్చడం ద్వారా వీరిద్దరు తోబుట్టువులని నిర్థారణ అయింది. దీంతో వెయిటింగ్‌ ఫర్‌ మీ అనే సీసీటీవీ కార్యక్రమం ద్వారా వారు కలిశారు. సమాధుల నుంచి తల్లిదండ్రుల డీఎన్‌ఏను సేకరించడానికి అక్కడి కట్టుబాట్ల పరంగా కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ.. జియాయు ధైర్యంగా సోదరుడి కోసం ముందడుగు వేసింది.

‘యాన్యన్‌ నువ్వు ఎక్కడ ఉన్నావ్‌. ఈ అమ్మ మొహాన్ని గుర్తుంచుకో. నిన్ను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నా. ఎప్పుడూ నీ గురించే కలగంటున్నా’ అంటూ కొడుకు కోసం మరణించిన తన తల్లి రాసుకున్న డైరీలోని కొన్ని మాటలను టీవీ కార్యక్రమంలో జియాయూ వినిపించింది. ఇక.. తమ్ముడిని తల్లిదండ్రుల సమాధి వద్దకు తీసుకెళ్లి మీ కొడుకు తిరిగొచ్చాడని చెప్తానని జియాయు తెలిపింది. కాగా.. తూర్పు చైనాలోని ఓ ఫ్యామిలీతో పాటు ఉంటున్న తాను.. అక్కడి వారి పోలికలు వేరుగా ఉండటంతో అనుమానంతో డీఎన్‌ఏ వివరాలు నమోదు చేశానని యాన్యన్‌ వెల్లడించాడు.

మరిన్ని వార్తలు